AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Citizenship: భారత పౌరుడు ఎవరు..? పుట్టిన తేదీని బట్టి మారే పౌరసత్వ చట్టం

భారత పౌరుడు అంటే ఎవరు? భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరూ భారత పౌరులేనా? పుట్టిన సంవత్సరం, తల్లిదండ్రుల పౌరసత్వం, వలస స్థితి ఆధారంగా భారత పౌరసత్వ నిబంధనలు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1955 పౌరసత్వ చట్టం, 1986, 2003, 2019 సవరణల వరకు పౌరసత్వానికి సంబంధించిన కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పుట్టుక, వారసత్వం, రిజిస్ట్రేషన్, సహజీకరణ వంటి మార్గాల ద్వారా భారత పౌరసత్వం ఎలా లభిస్తుంది? OCI అంటే ఏమిటి? CAA 2019లో ఏముంది? భారత పౌరసత్వ చట్టంలోని ముఖ్యమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Indian Citizenship: భారత పౌరుడు ఎవరు..? పుట్టిన తేదీని బట్టి మారే పౌరసత్వ చట్టం
Indian Citizenship
Santosh Nair
| Edited By: |

Updated on: Sep 18, 2026 | 4:19 PM

Share

ఢిల్లీలోని ఒకే ఆసుపత్రిలో మూడు వేర్వేరు దశాబ్దాల్లో ముగ్గురు పిల్లలు జన్మించారనుకోండి. ముగ్గురూ భారత్‌లో పుట్టారు. అయితే వారికి భారత పౌరసత్వం కల్పించే చట్టాలు మాత్రం ఒకలా ఉండదు.  1970లో జన్మించిన ఒక శిశువుకు అప్పటి చట్టం ప్రకారం భారత పౌరుడిగా పరిగణించబడతాడు. 1995లో పుట్టిన రెండో శిశువుకు మాత్రం నిబంధనలు మారిపోయాయి. నాటి చట్టం మేరకు భారత్‌లో పుట్టిన ఆ శిశువు తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై ఉంటే.. ఆ శిశువుకు భారత పౌరసత్వం వస్తుంది. 2010లో పుట్టిన మూడో శిశివుకు పౌరసత్వ నిబంధనలు మరింత కఠినమయ్యాయి. 2003 సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌లో జన్మించిన వ్యక్తికి తల్లిదండ్రులు ఇద్దరూ భారత పౌరులై ఉండాలి. లేదా తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరుడై ఉండి, మరొకరు అతని/ఆమె పుట్టిన సమయంలో అక్రమ వలసదారు కాకుండా ఉండాలి.

ఒకే ఆసుపత్రి.. ఒకే దేశం.. కానీ మూడు వేర్వేరు చట్టపరమైన మార్గాలు.

భారత పౌరసత్వం గురించి మనలో చాలామంది పెద్దగా ఆలోచించం. ఎందుకంటే చాలా మందికి అది చిన్నప్పటి నుంచే సహజంగా వచ్చిన గుర్తింపు. అయితే, మీరు భారత పౌరుడిగా ఎలా మారారన్న దాని వెనుక ఒక నిర్దిష్ట చట్టం, ఒక నిర్దిష్ట తేదీ, కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉంటాయి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5 నుంచి 11 దగ్గర మొదలవుతుంది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ఎవరు భారత పౌరులుగా పరిగణించబడాలనే విషయాన్ని ఈ నిబంధనలు నిర్దేశించాయి. విభజన తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రజల భారీ వలసల నేపథ్యంలో అప్పటి పౌరసత్వ ప్రశ్నలకు ఇవి సమాధానం ఇచ్చాయి.

అయితే పౌరసత్వానికి సంబంధించిన భవిష్యత్ నిబంధనలను రూపొందించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 పార్లమెంట్‌కు ఇచ్చింది. దాని ఆధారంగానే 1955లో Citizenship Act రూపొందింది. ఆ చట్టంలో తరువాత అనేక కీలక మార్పులు జరిగాయి.

భారత పౌరసత్వం పొందే మార్గాలు ఏమిటి?

Citizenship Act ప్రకారం భారత పౌరసత్వాన్ని ప్రధానంగా ఈ మార్గాల ద్వారా పొందవచ్చు:

-పుట్టుక ద్వారా -వారసత్వం ద్వారా -రిజిస్ట్రేషన్ ద్వారా -సహజీకరణ ద్వారా -కొత్త భూభాగం భారత్‌లో విలీనం కావడం ద్వారా

వీటిలో పుట్టుక ద్వారా పౌరసత్వం పొందే నిబంధనలు కాలక్రమేణా గణనీయంగా మారాయి. మొదట భారత్‌లో పుట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండగా, తరువాత తల్లిదండ్రుల పౌరసత్వ స్థితికి కూడా ప్రాధాన్యం పెరిగింది.

సింపుల్‌గా చెప్పాలంటే పుట్టుక ద్వారా పౌరసత్వానికి మూడు ముఖ్యమైన దశలు..

1950 జనవరి 26 – 1987 జూన్ 30: భారత్‌లో పుట్టిన వ్యక్తికి పుట్టిన ప్రదేశమే ప్రధాన ఆధారం.

1987 జూలై 1 – 2003 సవరణ అమల్లోకి వచ్చే వరకు: భారత్‌లో పుట్టిన వ్యక్తికి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారత పౌరుడై ఉండాలి.

2003 సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత: తల్లిదండ్రుల పౌరసత్వంతో పాటు, మరొక తల్లిదండ్రి అక్రమ వలసదారు కాదా అనే అంశం కూడా చట్టపరంగా కీలకమైంది.

అందుకే ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఆ సమయంలో తల్లిదండ్రుల పౌరసత్వ స్థితి ఏమిటి? అనే అంశాలు పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకంగా మారతాయి.

భారత్‌లో డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉందా?

భారతదేశం సాధారణంగా ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. ఒక భారత పౌరుడు స్వచ్ఛందంగా మరో దేశ పౌరసత్వాన్ని పొందితే, Citizenship Actలోని నిబంధనల ప్రకారం భారత పౌరసత్వం ముగుస్తుంది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం OCI – Overseas Citizen of India కార్డు. పేరులో ‘Citizen’ ఉన్నప్పటికీ OCI అనేది భారత పౌరసత్వం కాదు. OCI కార్డుదారులకు కొన్ని ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు భారత పాస్‌పోర్ట్ కలిగిన భారత పౌరులతో సమానమైన హోదా పొందరు.

2019 Citizenship Amendment Act ఎందుకు చర్చనీయాంశమైంది?

భారత పౌరసత్వ చట్టంలో అత్యంత చర్చకు దారితీసిన మార్పుల్లో Citizenship (Amendment) Act, 2019 – CAA ఒకటి. ఈ చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన కొంతమంది వ్యక్తులకు ప్రత్యేక నిబంధనల కింద భారత పౌరసత్వం పొందేందుకు మార్గాన్ని కల్పించింది. ఇందులో 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు భారత్‌లోకి వచ్చిన వారికి వర్తించే నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టం అమలుకు సంబంధించిన Citizenship (Amendment) Rules, 2024ను కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 11న నోటిఫై చేసింది.

CAAపై దేశంలో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. మద్దతుదారులు మతపరమైన హింసను ఎదుర్కొన్న కొన్ని వర్గాలకు చట్టబద్ధమైన పౌరసత్వ మార్గాన్ని కల్పించడమే దీని ఉద్దేశమని చెబుతారు. విమర్శకులు మతాన్ని పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక ప్రమాణంగా ఉపయోగించడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలతో ఎలా సరిపోతుందనే ప్రశ్నను లేవనెత్తారు.

అందువల్ల CAAపై చర్చ అనేది కేవలం రాజకీయ వాదన మాత్రమే కాదు; రాజ్యాంగం, పౌరసత్వ చట్టం, సమానత్వ హక్కు, వలసలు వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న న్యాయపరమైన, సామాజిక అంశం కూడా.

చివరికి తెలుసుకోవాల్సింది ఏమిటి?

భారత పౌరసత్వం అనేది కేవలం పుట్టిన ప్రదేశంతో నిర్ణయించబడే విషయం మాత్రమే కాదు. పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పౌరసత్వం, వలస స్థితి, చట్టంలోని సంబంధిత నిబంధనలు వంటి అంశాలు కూడా కీలకం.

1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు మారుతూ వచ్చాయి. 1955లో Citizenship Act వచ్చింది. తరువాత కాలంలో దానికి అనేక సవరణలు జరిగాయి. అంటే భారత పౌరసత్వ చట్టం ఒకే సమయంలో స్థిరపడిపోయిన వ్యవస్థ కాదు; కాలానుగుణంగా పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా మారుతూ వచ్చిన వ్యవస్థ.

ఈ రోజు భారత్‌లో ఒక ఆసుపత్రిలో మరో బిడ్డ పుడుతోంది. ఆ బిడ్డ భారత పౌరుడా? సమాధానం కేవలం “భారత్‌లో పుట్టాడు కాబట్టి” అని చెప్పడం ద్వారా పూర్తికాదు. ఆ సమాధానం వెనుక చట్టం ఉంది. తేదీలు ఉన్నాయి. తల్లిదండ్రుల వివరాలు ఉన్నాయి. రాజ్యాంగం ఉంది. అందుకే పౌరసత్వం గురించి మనం ఒకసారి అయినా చట్టాన్ని చదవడం, అర్థం చేసుకోవడం అవసరం.

మన హక్కుల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు.. ఆ హక్కులకు ఆధారమైన చట్టాన్ని ప్రశ్నించడం, అర్థం చేసుకోవడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత.

Follow Us