AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆఫీస్ జాబ్స్ తర్వాత బార్బర్ పనులపై AI కన్ను..?’ వీడియో షేర్ చేసిన హర్ష్ గోయెంకా

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్ సర్వీస్, తయారీ రంగం, ఆఫీస్ ఉద్యోగాలు.. ఇలా ఎన్నో రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వేగంగా పెరుగుతోంది. భవిష్యత్తులో అనేక పనులను AI, రోబోటిక్ సిస్టమ్స్ నిర్వహించే అవకాశం ఉందనే చర్చ ఇప్పటికే జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చర్చ సంప్రదాయంగా మనుషుల నైపుణ్యం, అనుభవం, స్పర్శపై ఆధారపడే పనుల వరకు చేరింది..

'ఆఫీస్ జాబ్స్ తర్వాత బార్బర్ పనులపై AI కన్ను..?' వీడియో షేర్ చేసిన హర్ష్ గోయెంకా
AI Replace Barbers
Srilakshmi C
|

Updated on: Sep 18, 2026 | 11:55 AM

Share

ప్రముఖ పారిశ్రామికవేత్త, RPG Enterprises ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఓ బార్బర్ ఒక వ్యక్తికి గడ్డం షేవ్ చేస్తుండగా.. అతను ఫ్యూచరిస్టిక్ మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌ను ధరించి ఉండటం కనిపించింది. వీడియోలో బార్బర్ తలకు కెమెరా, శరీరానికి హార్నెస్, వైర్లు, సెన్సర్లు ధరించి కనిపిస్తాడు. చేతుల కదలికలను ట్రాక్ చేసేందుకు మణికట్టుల వద్ద కూడా ట్రాకింగ్ పరికరాలు అమర్చినట్లు తెలుస్తోంది.

‘బార్బర్ ఉద్యోగం కూడా పోతుందా?’

అయితే బార్బర్ తన సాధారణ పనిని మాత్రం కొనసాగిస్తాడు. షేవింగ్ టూల్స్ ఉపయోగించడం, గడ్డానికి గ్రూమింగ్ ప్రొడక్ట్స్ అప్లై చేయడం, వివిధ కోణాల్లో షేవ్ చేయడం వంటి పనులను చేస్తూనే ఉంటాడు. అదే సమయంలో అతని చేతుల కదలికలు, శరీర భంగిమ, చేతుల కోణాలు, పని చేసే విధానం వంటి వివరాలను సిస్టమ్ రికార్డ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి టెక్నాలజీ ద్వారా మనుషులు చేసే క్లిష్టమైన శారీరక పనులపై డేటాను సేకరించవచ్చు. భవిష్యత్తులో ఈ డేటాను AI లేదా రోబోటిక్ సిస్టమ్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇప్పటివరకు AI ప్రభావం ఎక్కువగా డెస్క్ జాబ్స్‌పైనే ఉంటుందని భావించిన చాలామంది.. భవిష్యత్తులో చేతి నైపుణ్యం అవసరమైన సంప్రదాయ వృత్తుల్లోనూ ఆటోమేషన్ ప్రవేశించవచ్చా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

‘బార్బర్ దగ్గరకు వెళ్లినప్పుడు జరిగే వ్యక్తిగత సంభాషణలు, ఉచిత సలహాలు కూడా భవిష్యత్తులో AI తీసుకుంటుందా?’ అంటూ కొందరు నెటిజన్లు పేర్కొంటే.. మరికొందరు మాత్రం భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ముఖం దగ్గర పదునైన బ్లేడ్‌లతో పనిచేసే విషయంలో రోబోటిక్ వ్యవస్థలను ఎంతవరకు నమ్మవచ్చనే ప్రశ్నలను లేవనెత్తారు. ఓ నెటిజన్.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై ఆధారపడే రోబోట్ కంటే చేతులు కొద్దిగా వణికే మనిషి బార్బర్‌నే నమ్ముతానని సరదాగా వ్యాఖ్యానించాడు. మరో వ్యక్తి కూడా గడ్డం, జుట్టు కత్తిరించడానికి రోబోట్‌పై నమ్మకం లేదని, తాను ఎప్పటికీ తన బార్బర్‌పైనే ఆధారపడతానని కామెంట్‌ చేశాడు. మరికొందరు మాత్రం ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో చివరకు బార్బర్లే తమ నైపుణ్యాన్ని అందిస్తున్నారని, దీర్ఘకాలంలో ఇది వారి వృత్తిపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు.

కాగా సంప్రదాయ నైపుణ్యాలపై AI, ఆటోమేషన్ ప్రభావాన్ని చూపించే వీడియోను హర్ష్ గోయెంకా షేర్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో మహిళ చేతులకు మెహందీ వేసే యంత్రానికి సంబంధించిన AI రూపొందించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మహిళ తన చేతిని ఓ యంత్రంలో ఉంచగా.. యంత్రం తక్కువ మానవ జోక్యంతో క్లిష్టమైన మెహందీ డిజైన్‌ను రూపొందిస్తున్నట్లు కనిపించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సృజనాత్మకత, నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమైన సంప్రదాయ వృత్తులను కూడా భవిష్యత్తులో ఆటోమేషన్ మార్చగలదా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

AI అభివృద్ధి కేవలం కంప్యూటర్ ముందు చేసే పనులకే పరిమితం కాకుండా.. మనుషులు చేతులతో చేసే క్లిష్టమైన పనులను కూడా నేర్చుకునే దిశగా సాగుతున్నట్లు ఈ వీడియోలు చర్చకు తెస్తున్నాయి. అయితే బార్బర్ వంటి వృత్తుల్లో మానవ స్పర్శ, అనుభవం, కస్టమర్‌తో ప్రత్యక్షంగా వ్యవహరించే నైపుణ్యం ఎంతవరకు యంత్రాలతో భర్తీ చేయగలమనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. AI భవిష్యత్తులో ఉద్యోగాల స్వభావాన్ని మాత్రమే కాదు.. మనం ఇప్పటివరకు పూర్తిగా మానవ నైపుణ్యంపై ఆధారపడతాయని భావించిన వృత్తులనూ మార్చే అవకాశం ఉందనే చర్చను ఈ వైరల్ వీడియో మరోసారి ముందుకు తెచ్చింది.

Follow Us