AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Story: జీవితాన్ని కుదిపేసిన ఘటన.. అయినా వెనక్కి తగ్గలేదు.. IASగా ఎదిగిన మోహితా శ్రీవాస్తవ కథ

ఒక దారుణ ఘటనతో జీవితం ముగిసిపోయిందని భావించకుండా, కష్టాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగిన మోహితా శ్రీవాస్తవ కథ స్ఫూర్తినిస్తుంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమెకు తండ్రి, గురువు అండగా నిలిచారు. జీవితంలో ఎదురైన తీవ్ర విషాదం, తండ్రి మరణం, వరుస సవాళ్లను దాటుకుంటూ చదువుపై దృష్టి పెట్టిన మోహితా చివరకు సివిల్‌ సర్వీసెస్‌ సాధించి ఐఏఎస్‌ అధికారిణిగా ఎదిగింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పట్టుదల, విద్య, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవచ్చనే సందేశాన్ని ఆమె ప్రయాణం అందిస్తుంది..

Real Story: జీవితాన్ని కుదిపేసిన ఘటన.. అయినా వెనక్కి తగ్గలేదు.. IASగా ఎదిగిన మోహితా శ్రీవాస్తవ కథ
IAS Mohita Srivastava Story
Srilakshmi C
|

Updated on: Sep 17, 2026 | 12:00 PM

Share

జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది. కొన్ని కథలు ఊహాజనితమైనవైనా వాటిలోని నీతి మనల్ని ఆలోచింపజేస్తుంది. మరికొన్ని నిజ జీవిత ఘటనలు మనకు స్ఫూర్తిని అందిస్తాయి. అలాంటి కథల్లో మోహితా శ్రీవాస్తవ ప్రయాణం ఒకటి. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన మోహితను ఆమె తండ్రి నిర్మల్ శ్రీవాస్తవ ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. కిరాణా దుకాణం నడుపుతూ, కొద్దిపాటి వ్యవసాయ భూమిని చూసుకుంటూ తన కుమార్తె చదువే లక్ష్యంగా జీవించాడు. మోహిత కూడా చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేది.

ఎనిమిదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న ఆమెను తొమ్మిదో తరగతి కోసం సమీపంలోని మరో గ్రామంలోని పాఠశాలలో చేర్పించాడు తండ్రి. ప్రతిరోజూ తానే తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీలాల్ చటర్జీ కూడా మోహిత చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. అదే పాఠశాలలో ఓ పారిశ్రామికవేత్త కుమారుడు నిరంజన్ చదువుతున్నాడు. అతడి ప్రవర్తన సరిగా ఉండేది కాదని, చెడు స్నేహితులతో తిరిగేవాడు. మోహితను ఇష్టపడుతున్నానంటూ అతడు ఆమెకు పరోక్షంగా సహాయం చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత తన మనసులోని మాటను మోహితకు చెప్పాడు. అది విన్న మోహిత తీవ్రంగా భయపడింది. వెంటనే ఈ విషయాన్ని తన ఉపాధ్యాయుడికి చెప్పింది. ఆ తర్వాత తండ్రికి కూడా విషయం తెలియజేసింది. కుమార్తెకు జరిగిన విషయం తెలుసుకున్న నిర్మల్ ఆగ్రహానికి గురయ్యాడు. పాఠశాల వెలుపల నిరంజన్ కనిపించడంతో అతడిని మందలించాడు. అక్కడితో సమస్య ముగిసిందని మోహిత కుటుంబం భావించింది. కానీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి విషాదకరంగా మారింది.

అదృశ్యమైన మోహిత

ఒక రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న మోహితను నిరంజన్, అతడి స్నేహితులు వ్యాన్‌లోకి బలవంతంగా తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మోహిత అదృశ్యంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీలాల్ చటర్జీ సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రభావవంతమైన కుటుంబం కారణంగా మొదట కేసు నమోదు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రోజుల తర్వాత మోహిత పాఠశాల పరిసరాల్లో తీవ్ర దయనీయ స్థితిలో కనిపించింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన తర్వాత మోహితకు మరో బాధ మొదలైంది. ఆమెను ఆదుకోవాల్సిన సమాజంలోని కొందరు ఆమెనే తప్పుబట్టేలా ప్రవర్తించారు. ఈ పరిస్థితి ఆమెను మరింత మానసికంగా కుంగదీసింది.

ఇవి కూడా చదవండి

ఊరిని విడిచి కొత్త జీవితానికి

కుమార్తె పరిస్థితిని చూసిన నిర్మల్ తీవ్రంగా కలత చెందాడు. రాజకీయంగా, సామాజికంగా తనకు న్యాయం దక్కడం లేదని భావించిన ఆయన తన ఆస్తులను విక్రయించి మోహితను తీసుకుని ఊరిని విడిచిపెట్టాడు. ఈ సమయంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీలాల్ చటర్జీ తండ్రీకూతుళ్లకు అండగా నిలిచారు. పట్టణంలో వారికి నివాసం ఏర్పాటు చేయడమే కాకుండా మోహిత చదువును కొనసాగించేలా సహాయం చేశారు. కొత్త వాతావరణంలో మోహిత మెల్లగా చదువుపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. అయితే గత సంఘటనల ప్రభావం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఇంతలో ఆమె తండ్రి నిర్మల్ అనారోగ్యానికి గురయ్యాడు. మోహిత పదో తరగతి పరీక్షలు రాసే సమయంలోనే ఆయన కన్నుమూశాడు. తండ్రిని కోల్పోయిన బాధతో ఆమె మరింత కుంగిపోయింది. అయినా తండ్రి తన కోసం కన్న కలను నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగింది.

ఢిల్లీలో చదువు.. జీవితంలో కొత్త మలుపు

మోహిత ఎంత నిరాకరించినా శ్రీలాల్ చటర్జీ ఆమెను ఢిల్లీలోని ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాడు. అక్కడి వాతావరణం ఆమె గత జీవితానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. తండ్రి జ్ఞాపకాలను, ఆయన తనపై పెట్టుకున్న ఆశలను బలంగా తీసుకున్న మోహిత చదువుపై దృష్టి పెట్టింది. క్రమంగా తనలోని భయాలను అధిగమించింది. ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసింది. IAS సాధించాలనే లక్ష్యంతో సిద్ధమైంది. ఆమెకు శ్రీలాల్ చటర్జీ మార్గదర్శకత్వం కొనసాగించారు. మొదటి ప్రయత్నాల్లో ఎదురైన కొన్ని వైఫల్యాలు ఆమెను నిరాశపరిచినా, ఆమె వెనక్కి తగ్గలేదు. తన గతం తన భవిష్యత్తును నిర్ణయించకూడదని భావించి మరింత పట్టుదలతో ముందుకు సాగింది. చివరికి మోహితా శ్రీవాస్తవ ఐఏఎస్ అధికారిణిగా ఎదిగింది. ఒక దారుణ ఘటన తన జీవితాన్ని పూర్తిగా నిర్వచించనివ్వకుండా, తన విద్యను, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను ఆయుధాలుగా మార్చుకుని ముందుకు సాగిన మోహిత ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

ఆమె కథలో తండ్రి నిర్మల్ శ్రీవాస్తవ ప్రేమ, ప్రధానోపాధ్యాయుడు శ్రీలాల్ చటర్జీ అందించిన మార్గదర్శకత్వం కీలకంగా నిలిచాయి. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, సరైన సమయంలో లభించే అండ, విద్య, ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలవనే సందేశాన్ని ఈ కథనం అందిస్తుంది. అత్యాచారం, లైంగిక హింసకు గురైన వ్యక్తిపై నింద వేయడం బాధితురాలిదే తప్పన్న భావనను మరింత పెంచుతుంది. జరిగిన నేరానికి బాధితురాలిని బాధ్యురాలిగా చూడకూడదు. ఆమెకు కుటుంబం, సమాజం, చట్టం నుంచి భద్రత, గౌరవం, న్యాయం, మద్దతు లభించాలి. మోహిత కథ చెప్పే ప్రధాన సందేశం.. ఒక దారుణ సంఘటనతో జీవితం ముగిసిపోదు. అవకాశం, అండ, విద్య, ఆత్మవిశ్వాసం ఉంటే జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవచ్చు. స్త్రీగా పుట్టడం బలహీనత కాదు. అలాగే ఏ మనిషినైనా అతడు ఎదుర్కొన్న దుర్ఘటనతో మాత్రమే నిర్వచించకూడదు. బాధితురాలిని ప్రశ్నించే ముందు, ఆమెకు అండగా నిలిచే సమాజంగా మనం మారగలమా అనేదే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం.

Follow Us