ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. 16 ఏళ్ల బాలికపై నలుగురు నరరూప రాక్షసులు దారుణంగా..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం మరో నిర్భయ తరహా కలకలం రేపింది. కదులుతున్న టెంపోలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి, కత్తులతో పొడిచి కిరాతకంగా ప్రాణాలు తీశారు నలుగురు దుండగులు. మృతదేహాన్ని నిర్మానుష్య పొలాల్లో పడేయడంతో వీధి కుక్కలు పీక్కుతిన్న ఈ పాశవిక ఉదంతం.. యావత్ దేశాన్ని నివ్వెరపరుస్తుంది.

దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు, ఆపై కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేయగా.. వీధి కుక్కల మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. ఈ అమానుష ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లు సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో కుశక్ రోడ్డు వద్ద ఉన్న ఓ పొలంలో సెప్టెంబర్ 13న తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం ఎంతలా పాడైపోయిందంటే.. మొదట అది స్త్రీదా లేక పురుషుడిదా అన్నది కూడా గుర్తించలేకపోయారు. మృతదేహంలోని కొన్ని భాగాలను కుక్కలు పీక్కుతినడంతో పాటు ఒక చేయి శరీరం నుంచి వేరుపడి కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టెంపోలోనే దారుణం..
పోలీసుల విచారణలో బాధితురాలు, నిందితులకు ముందే పరిచయం ఉన్నట్లు తేలింది. వీరంతా కలిసి ఒక టెంపో వాహనంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే ఆ టెంపోలోనే బాలికపై నలుగురూ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆమెను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. ఆపై మృతదేహాన్ని పొలాల్లో పడేసి పరారయ్యారు. అయితే బాలిక తరచూ ఇంటి నుంచి వెళ్లిపోతూ కొద్ది రోజుల పాటు తిరిగి వస్తుండటంతో, కుటుంబ సభ్యులు ఆమె అదృశ్యంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటన స్థలం, పరిసర ప్రాంతాల్లోని 50కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చీకటిలో అనుమానాస్పదంగా తిరిగిన ఒక టెంపోను గుర్తించి, అనేక ప్రాంతాల కెమెరాల ఆధారంగా దాన్ని ట్రాక్ చేశారు. సెప్టెంబర్ 15-16 రాత్రి నిర్వహించిన ఆపరేషన్‌లో టెంపోను గుర్తించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం నిజం బయటపడింది.
నలుగురు అరెస్ట్..?
ఈ నేరానికి సంబంధించి ఏళ్ల ఖడ్డా కాలనీకి చెందిన శివం అలియాస్ సుదామ అలియాస్ చుచుతో పాటు 16, 17 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రక్తపు మరకలున్న దుస్తులు, నేరానికి వాడిన టెంపోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి, ఫోరెన్సిక్ ఆధారాలతో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
