AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి సన్నిహితురాలి ఫ్లాట్‌లో నోట్ల కట్టల గుట్ట.. ఎంత మంది, ఎన్ని గంటలు లెక్కించారంటే..?

బెంగాల్‌లో వెలుగుచూసిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీపై వేటు పడింది. పార్థ ఛటర్జీని కేబినెట్‌ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొలగించారు.

మంత్రి సన్నిహితురాలి ఫ్లాట్‌లో నోట్ల కట్టల గుట్ట.. ఎంత మంది, ఎన్ని గంటలు లెక్కించారంటే..?
Arpita Mukherjee
Janardhan Veluru
| Edited By: Phani CH|

Updated on: Jul 28, 2022 | 6:00 PM

Share

బెంగాల్‌లో వెలుగుచూసిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee)పై వేటు పడింది. పార్థ ఛటర్జీని కేబినెట్‌ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొలగించారు. పార్థ ఛటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) ఇళ్లలో ఈ స్కాంకు సంబంధించి దాదాపు రూ.50 కోట్ల నగదు ఈడీ దాడుల్లో బయటపడ్డాయి. ఈ డబ్బుతో పాటు 5 కిలోల బంగారు ఆభరణాలను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అరెస్టయిన పార్థా ఛటర్జీ సన్నిహితురాలు రెండో ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది.

నాలుగు రోజులు క్రితం అర్పిత ఇంట్లో రూ.21.9 కోట్లు పట్టుబడగా..బుధవారంనాడు మరో ఇంట్లో జరిపిన దాడుల్లో రూ.27.9 కోట్లు సీజ్‌ చేశారు. ఫ్లాట్‌లోని బెడ్ రూంతో పాటు వాష్ రూమ్‌లో దాచిన నగదు కట్టలు, బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. నగదులో ఎక్కువగా రూ.2,000, రూ.500 కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నాయి. అలాగే విదేశీ కరెన్సీ, ఇతర ఖరీదైన వస్తువులను కూడా ఈడీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అర్పితకు చెందిన రెండు ఇళ్ల నుంచి మొత్తం రూ.49.9 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

Ed Raids Partha Chatterjee

Ed Raids Partha Chatterjee

కాగా ఈడీ దాడులు, డబ్బు కట్టల స్వాధీనంకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రూ.27.9 కోట్ల నగదును నాలుగు క్యాష్ కౌంటింగ్ మిషన్ల ద్వారా ఎనిమిది మంది బ్యాంక్ అధికారులు లెక్కించారు. నోట్ల కట్టల లెక్కింపు పూర్తి చేసేందుకు వారికి 13 గం.ల సమయం పట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. నగదు లెక్కింపునకు ఈడీ అధికారులు ఎస్బీఐ అధికారులను పిలిపించారు. ఈడీ అధికారుల సమక్షంలో వారు బుధవారం సాయంత్రం 4.30 గం.లకు నాలుగు కరెన్సీ కౌంటింగ్ మిషన్ల ద్వారా కౌంటింగ్ మొదలుపెట్టారు. గురువారం ఉదయం 5.30 గం.ల వరకు నోట్ల కట్టల లెక్కింపును కొనసాగించారు. అర్పిత రెండో ఇంట్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.4.31 కోట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. ఉదయాన ట్రక్స్‌లో అక్కడ స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, విదేశీ కరెన్సీ, ఇతర విలువైన వస్తువులను ఈడీ కార్యాలయానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

గత శనివారం మంత్రి పార్థ ఛటర్జీతో పాటు అర్పితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ ఆగస్టు 3వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించారు. ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతున్న టైమ్‌లో మళ్లీ భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21.9 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పిత ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న నగదు కూడా ఆ కుంభకోణానికి సంబంధించినదేనని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అర్పితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఇప్పటి వరకు దాదాపు రూ.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. ఈ కుంభకోణంలో మొత్తం రూ.120 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అర్పితకు ఇంకెన్ని ఇళ్లు ఉన్నాయి.. వాటిలో ఇంకెన్ని కోట్లు ఉన్నాయి అన్న అనుమానాలతో ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..