పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ ఇంటివద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్ సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణమంటూ రాష్ట్ర ఆప్ శాఖ చీఫ్ భగవంత్ సింగ్ మాన్ ఆధ్వర్యాన వందలాది కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను (జల ఫిరంగులను) ప్రయోగించారు. మొహాలీ లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద జరిగిన ఈ ఆందోళన మరింత ఉధృతం కాకుండా చూసేందుకు పోలీసులు భగవంత్ సింగ్ మాన్ సహా పలువురు ఆప్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీరిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్లలోకి ఎక్కించారు. విద్యుత్ కొరత నేపథ్యంలో ఈ వేసవిలో పవర్ కట్స్ కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళలను సర్కార్ తగ్గించింది. ఎయిర్ కండీషనర్ల వంటివాటి వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. ప్రస్తుతం ఇక్కడ విద్యుత్ సమస్య ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి ప్రధాన ఆయుధంగా మారింది. ఈ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో ప్రజలకు 300 యూనిట్ల వరకు కరెంట్ ను ఉచితంగా ఇస్తామని కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు.
అటు ఢిల్లీలో మకాం వేసిన అసమ్మతి నేత. మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా తమ రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సింగ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఇక అకాలీదళ్ కూడా నిన్న రాష్ట్రంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి: సినీ ఫక్కీలో క్రిమినల్ అరెస్ట్..!గ్యాంగ్‌స్టర్‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు..ట్రెండ్ అవుతున్న వీడియో:police video.