
మధుర, డిసెంబర్ 16: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. రోడ్డుపై పలు బస్సులు, కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అందిన సమాచారం మేరకు మొత్తం 4 బస్సులకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సులు మంటల్లో కాలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానికులు, వాహనదారులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P
ఇవి కూడా చదవండి— ANI (@ANI) December 16, 2025
సమీపంలోని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బస్సుల మంటలకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ ఘటనలో నాలుగు బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు ఆ వ్యక్తి వీడియోలో తెలిపాడు. భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఓ వైపు దట్టమైన పొగలు.. మరోవైపు బస్సుల్లో ప్రమాదానికి గురైన ప్రయాణికుల ఆర్తనాదాలతో.. ఆ ప్రదేశం భీతావాహకంగా మారింది.
అక్కడి దట్టమైన మంచుకారణంగా 7 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. బల్దేవ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మైల్‌స్టోన్ 127 సమీపంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే డిఎం, ఎస్పీతో సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.