
ఉత్తర కాశీలో టన్నెల్ కుప్పకూలిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 17 రోజుల తర్వాత ఉత్తరకాశీ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కుప్ప కూలిన సొరంగం నుంచి సురక్షితంగా రక్షించబడిన కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కార్మికుల ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలను ప్రధాని అభినందించారు.
“ఉత్తరకాశీలో మా సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సొరంగంలో చిక్కుకున్నప్పటికీ మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగిస్తుంది. మీ అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను” ప్రధానమంత్రి ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. “చాలా కాలం నిరీక్షణ తర్వాత, కార్మికులు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందం కలిగించే విషయంగా ప్రధాని తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలన్నీ తమ వాళ్ల కోసం ఓపికగా ఎదురు చూసిన తీరు అనిర్వచనీయమైనది పోస్ట్ చేశారు.
చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగం నవంబర్ 12న కుప్పకూలిన విషయం మనకు తెలిసిందే. ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే కార్మికులను సురక్షితంగా తరలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెస్క్యూ బృందాలను బరిలోకి దింపాయి. హైటెక్ డ్రిల్లింగ్ మెషీన్‌లను ఉపయోగించి రోల్-హోల్ మైనింగ్ నిపుణుల సహాయంతో చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. 12 మీటర్ల విస్తీర్ణాన్ని 24 గంటల్లోపు తవ్వారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత దాదాపు 14 డిగ్రీల సెల్సియస్ ఉంది. టన్నల్ నుంచి బయటి వాతావరణానికి అలవాటు పడటానికి కార్మికులకు కొంత సమయం పట్టింది.
కార్మికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రెచర్లపై బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీం. ఆ సమయంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అక్కడే ఉన్నారు. కార్మికులు బయటకు రాగానే కౌగిలించుకున్నారు. ఆ తరువాత కార్మికులు తమ కుటుంబాలను కలుసుకొని తాము పడిన కష్టం గురించి, చేదు అనుభూతులను పంచుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..