Dalai Lama: దలైలామా 90వ పుట్టినరోజు.. ప్రత్యేక థీమ్ సాంగ్ విడుదల చేసిన VIP మోషన్ పిక్చర్స్..
ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు జూలై 6న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో భారత ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఈ వేడుకను మరింత స్పెషల్‌గా చేయడానికి దలైలామాపై ఒక పాటను కూడా రూపొందించారు. వీఐపీ మోషన్ పిక్చర్స్ రూపొందించిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.

బౌద్ద మత గురువు దలైలామా 90వ పుట్టిన రోజు వేడుకలు జూలై 6న ఘనంగా జరిగాయి. ఆయన అనుచరులు అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో భారత ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఈ వేడుకను ప్రత్యేకంగా నిలపడానికి దలైలామాపై ఒక అద్భుతమైన పాటను రూపొందించారు. ఈ విషయాన్ని వీఐపీ మోషన్ పిక్చర్స్ ప్రతినిధి వికాస్ పరాశర్ సోషల్ మీడియాలో తెలిపారు. ‘‘వీఐపీ మోషన్ పిక్చర్స్‌కు ఇదొక గర్వకారణమైన క్షణం. దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా థీమ్ సాంగ్‌ను ప్రదర్శించడం మాకు గౌరవంగా ఉంది. ఇది శాంతి, కరుణ, జ్ఞానం యొక్క చిహ్నామైన దలైలామాకు మేం అందిస్తున్న ఆత్మీయ కానుక ’’ అని వికాస్ పరాషర్ పోస్ట్ చేశారు.
దలైలామాపై థీమ్ సాంగ్
‘‘ఈ ప్రత్యేక పాటను రూపొందించడానికి దలైలామా, ప్రతిష్టాత్మక టిబెటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (TIPA)తో కలిసి పనిచేయడం VIP మోషన్ పిక్చర్స్‌కు దక్కిన గౌరవం’’ అని వికాస్ పరాషర్ తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం అని వ్యాఖ్యానించారు. ఈ జ్ఞాపకం తమ మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు.
దలైలామా కీలక ప్రకటన
కాగా ఇటీవలే తన వారసుడి ఎంపికకు సంబంధించిన దలైలామా కీలక ప్రకటన చేశారు. తన వారసుడిని ఎంపిక చేసే హక్కు కేవలం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని చెప్పారు. ఈ ప్రకటనను భారత్ కూడా సమర్ధించింది. అయితే చైనా మాత్రం ఫైర్ అయ్యింది. తమ అనుమతి లేకుండా 15వ దలైలామాను ఎంపిక చేయొద్దని తెలిపింది. అంతేకాకుండా చైనా చట్టాలకు లోబడి, బీజీంగ్‌లో ఆ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేసింది. చైనా ప్రకటనను దలైలామా కొట్టిపారేశారు.
అదేవిధంగా తాను మరో 40 ఏళ్లు జీవించాలని కోరుకుంటున్నట్లు దలైలామా చెప్పారు. తనకు అవలోకితేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని.. ప్రజలకు సేవ చేసేందుకు 130 ఏళ్లు జీవించాలనుకుంటున్నట్లు తెలిపారు. కాగా జూలై 6, 1935న ఒక రైతు కుటుంబంలో దలైలామా జన్మించారు. దలైలామాను బోధిసత్వ అవలోకితేశ్వరుడి అవతారంగా భావిస్తారు. టిబెట్ విముక్తి కోసం ఆయన చేసిన అహింసా పోరాటానికి 1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.




