Veerappan: 20 ఏళ్లకు పైగా ముచ్చెమటలు పట్టించిన బందిపోటు.. 20 నిమిషాల్లోనే మట్టుబెట్టిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..?

|

Oct 18, 2022 | 12:16 PM

వీరప్పన్ 1952 జనవరి 18న కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. అతను 17 సంవత్సరాల వయస్సు నుంచే వేటాడడం ప్రారంభించాడని స్థానికులు చెబుతారు. అతను కిరాతకంగా ఏనుగుల నుదిటి మధ్యలో బుల్లెట్లు కాల్చేవాడని పేర్కొంటారు.

Veerappan: 20 ఏళ్లకు పైగా ముచ్చెమటలు పట్టించిన బందిపోటు.. 20 నిమిషాల్లోనే మట్టుబెట్టిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..?
Veerappan
Follow us on

వీరప్పన్.. ఒకప్పుడు ఈ పేరు చెబితే వెన్నులో వణుకుపుట్టేది.. దేశంలోని పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోని నరహంతకుడిగా చెలామణి అయ్యాడు.. పేరుకు తగినట్లే భయంకర రూపం.. మందపాటి పొడుగైన మీసాలు.. చేతిలో తుపాకీ.. క్రూరత్వమైన వ్యక్తిత్వం కలిగిన బందిపోటు కొన్ని దశాబ్దాలపాటు భద్రతా దళాలకు, పలు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాడు. వీరప్పన్ పూర్తి పేరు.. కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్.. వీరప్పన్ ఎర్ర చందనం, ఏనుగు దంతాల స్మగ్లర్.. తన దురాఘతాన్ని ఎదురించిన ఎందరినో కిడ్నాప్ చేశాడు. వారిలో నాయకులు, ప్రముఖులు సైతం ఉన్నారు. ఇతని చేతిలో హతమైన వారిలో కర్ణాటక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఏనుగు దంతాల కోసం వందలాది ఏనుగులను చంపాడు.. కోట్లాది రూపాయల విలువైన గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసిన వీరప్పన్.. తన స్మగ్లింగ్‌కు అడ్డుగా ఉన్నారని.. 150 మందిని పైగా అతి దారుణంగా చంపాడు.. ఓ అధికారి తల నరికి ఫుట్‌బాల్ కూడా ఆడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. వీరప్పన్ చేతిలో చనిపోయినవారిలో సగానికి పైగా పోలీసులే ఉన్నారు. అలాంటి బందిపోటు నుంచి దేశానికి ఉపశమనం కలిగింది ఈ రోజే.. 2004, అక్టోబర్ 18న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

వీరప్పన్ 1952 జనవరి 18న కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. అతను 17 సంవత్సరాల వయస్సు నుంచే వేటాడడం ప్రారంభించాడని స్థానికులు చెబుతారు. అతను కిరాతకంగా ఏనుగుల నుదిటి మధ్యలో బుల్లెట్లు కాల్చేవాడని పేర్కొంటారు. అలా అరాచకాలకు పాల్పడుతూ.. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అడవులను తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. దాదాపు 36 సంవత్సరాలపాటు మూడు ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. అలాంటి వీరప్పన్ భద్రతా బలగాలను సైతం కబంధ హస్తాల్లోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ బందిపోటును హతమార్చేందుకు పోలీసులు, భద్రతా బలగాలు దశాబ్దాలపాటు కష్టపడాల్సి వచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వీరప్పన్ దోపిడీకి సంబంధించిన చర్చిలు జరిగేవంటే.. అతను ఎలాంటి కిరాతకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అనేక రాష్ట్రాల పోలీసులు వీరప్పన్ కోసం 20 ఏళ్లుగా వేట కొనసాగించారు. అతన్ని పట్టుకునేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. వీరప్పన్‌ను చంపిన అధికారి పేరు కె. ఇతను విజయ్ కుమార్. వీరప్పన్‌ను సజీవంగా లేదా ఎన్‌కౌంటర్ అయినా చేయాలని ప్రభుత్వం నుంచి తనకు ఆదేశాలు అందాయని.. దీంతో ముందుకు వెళ్లినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వీరప్పన్ కంటికి చికిత్స కోసం అడవి నుంచి వెళుతుండగా ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతన్ని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), వీరప్పన్ వెళుతున్న అంబులెన్స్‌పై 338 బుల్లెట్లను కాల్చింది. వాటిలో మూడు మాత్రమే 52 ఏళ్ల వేటగాడిని హతమార్చాయి. అయితే.. వీరప్పన్ కోసం చేసిన దశాబ్దాల వేట.. 20 నిమిషాల్లో ముగిసిందని.. STF చీఫ్ విజయ్ కుమార్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఆ రోజు రాత్రే ఫైల్ క్లోజ్..

తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు అధిపతిగా ఉండి, వీరప్పన్ ను మట్టుబెట్టేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్ కోకూన్‌ను నడిపిన విజయ్ కుమార్ తన పుస్తకం, వీరప్పన్: ఛేజింగ్ ద బ్రిగాండ్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బందిపోటును వెంబడించడం, వేట గురించి పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. పథకం ప్రకారం.. తమిళనాడులోని తానున్న అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన వీరప్పన్ తెలియకుండానే తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన రహస్య పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లోకి దగ్గరకు వచ్చాడు. అయితే.. వీరప్పన్ తన కంటి చికిత్స కోసం సేలంలోని ఆసుపత్రిని సందర్శిస్తున్నాడన్న సమాచారం అందుకున్న.. పోలీసులు పక్కా ప్లాన్ రచించారు. ఆ రోజు, అంబులెన్స్‌లో ‘సేలం’ పేరు ‘సెలం’ అని తప్పుగా ఉన్నా వీరప్పన్ గమనించలేదు. చిన్న తప్పిదాన్నైనా ఇట్టే పసిగట్టే వీరప్పన్.. ఆరోజు గమనించలేకపోయాడు. దీంతోపాటు మీసాలు కత్తిరించుకుని, తెల్లటి వస్త్రం కప్పుకుని వచ్చాడు.

అప్పటికే.. ఆ అంబులెన్స్ లో ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది.. డ్రైవర్ ఉన్నారు. అనుకున్న దాని ప్రకారం.. నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నాక డ్రైవర్ శరవణన్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు.. దీంతో సీట్లలో కూర్చున్నవారంతా కిందపడిపోయారు.. అలా అంబులెన్స్ లో ఉన్న వీరప్పన్ కథ.. 20 నిమిషాల్లో ముగిసిందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ తెలిపారు. దాదాపు 20 ఏళ్లకు పైగా పలు ప్రభుత్వాలను కంటిమీద కునుకు లేకుండా చేసిన.. బందిపోటు వీరప్పన్ కేసును.. 2004, అక్టోబర్ 18న రాత్రి 11:10 గంటలకు మూసివేశారు. సూధీర్ఘ కాలంపాటు కొనసాగిన ఆపరేషన్ కోకూన్.. చివరకు విజయవంతం కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

వీరప్పన్ పుస్తకంలో ఆసక్తికర విషయాలు..

రిటైర్డ్ పోలీసు అధికారి కె విజయ్ కుమార్.. వీరప్పన్ పుస్తకం: చేజింగ్ ది బ్రిగాండ్ ముగింపులో ఇలా పేర్కొన్నారు. “కూసే మునిస్వామి వీరప్పన్‌పై ఫైల్ మూసివేశాం.. ఆపరేషన్ కోకూన్ విజయవంతమైంది.. “18వ తేదీన వీరప్పన్ రాకపోయి ఉంటే ఏమై ఉండేదో నాకు తెలియదు. ఇది మా సీరియల్ ఫ్లాప్‌లలో ఒకటిగా ఉండేది” అని కుమార్ చెప్పారు. అసాధారణంగా, అప్పటివరకు అంతుచిక్కని వీరప్పన్ ఆ రోజు చాలా అప్రమత్తంగా లేడని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలో అటవీప్రాంతంలో గాలింపు, రహస్య సమాచారం, పలు వివరాల సేకరణ, వేట కోసం చేసిన ప్రయత్నాలు, తప్పించుకున్న విధానం, వీరప్పన్ అరాచకాలు, కిడ్నీప్, హత్యలు ఇలా అన్ని వివరాలను వెల్లడించారు.

కాగా.. తమిళనాడు STF కి అధిపతిగా ఉన్న విజయ్ కుమార్‌ను.. వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ కోకూన్ చీఫ్‌గా నియమించారు. 2001లో అప్పటి ముఖ్యమంత్రి జె జయలలిత దీనిని ఏర్పాటు చేశారు. వీరప్పన్‌ను పట్టుకోవడానికి 1990లో కర్ణాటక – తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా STF-ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి వీరప్పన్ కోసం వేట ప్రారంభమైంది. 2004లో వీరప్పన్ అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చిచంపడంతో ఈ ఆపరేషన్ ముగిసింది. ఈ ఆపరేషన్ కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా ఇది నిలిచింది. చివరకు 14 ఏళ్ల తర్వాత వీరప్పన్ ఆపరేషన్ పూర్తవ్వడంతో తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు పలు ప్రభుత్వాలు ఊపిరిపీల్చుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..