పొలం చదును చేస్తుండగా బయటపడిన పురాతన కుండ.. లోపల కళ్లు చెదిరేలా..!
ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఓ అత్యంత ఆశ్చర్యకరమైన, ఉత్కంఠభరితమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తారయసుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామ పంచాయతీలో నివాసముండే రాధేశ్యామ్ వర్మ అనే రైతు పొలం పనులు మొదలుపెట్టాడు. మట్టి తవ్వుతుండగా, వందలాది చారిత్రక వెండి నాణేలతో నిండిన ఒక పురాతన ఇత్తడి కుండ (లంకె బిందె) బయటపడింది.

ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఓ అత్యంత ఆశ్చర్యకరమైన, ఉత్కంఠభరితమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తారయసుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామ పంచాయతీలో నివాసముండే రాధేశ్యామ్ వర్మ అనే రైతు పొలం పనులు మొదలుపెట్టాడు. మట్టి తవ్వుతుండగా, వందలాది చారిత్రక వెండి నాణేలతో నిండిన ఒక పురాతన ఇత్తడి కుండ (లంకె బిందె) బయటపడింది. అయితే, ఆ కుండను భూమిలో నుంచి బయటకు తీసే క్రమంలో అది పగిలిపోవడంతో, అందులోని విలువైన నాణేలన్నీ పొలమంతా చెల్లాచెదురయ్యాయి.
పొలంలో పురాతన నిధి దొరికిందన్న వార్త చుట్టుపక్కల గ్రామాల్లో దావానలంలా వ్యాపించింది. దాంతో వందలాది మంది గ్రామస్తులు పారలు, టార్చ్‌లైట్లతో పొలానికి చేరుకున్నారు. నాణేలను ఎత్తుకెళ్లడానికి జనం పోటీ పడటంతో అక్కడ పెద్ద తొక్కిసలాట జరిగింది. అక్కడ పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నాణేలను ఏరుకుని పారిపోయారని పొలం యజమాని చెప్తున్నారు. ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనన్న ఆశతో జనం అర్ధరాత్రి వరకు పారలతో పొలాన్ని తవ్వుతూనే ఉన్నారని తెలిపారు.
ప్రాథమిక పరిశోధనలు, నాణేల రూపకల్పన ఆధారంగా ఇవి సుమారు క్రీ.శ. 1640 నాటి మొఘల్ చక్రవర్తుల కాలం నాణేలని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నాణేలపై అరబిక్, ఉర్దూ, పర్షియన్ లిపిలో శాసనాలు ఉన్నాయి. అయితే, వీటి కచ్చితమైన కాలం, చారిత్రక ప్రాముఖ్యత భారత పురావస్తు శాఖ పరిశోధన తర్వాతే అధికారికంగా నిర్ధారణ కానుంది.
సమాచారం అందుకున్న తారయసుజన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి నితిన్ రఘునాథ్ శ్రీవాస్తవ పోలీసు బృందంతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరుసటి రోజు పోలీసులు క్షుణ్ణంగా విచారణ ప్రారంభించగా, పొలం యజమాని రాధేశ్యామ్ వర్మ నిజాయితీని ప్రదర్శించి, తన వద్ద ఉన్న 330 వెండి నాణేలను స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించారు. అయితే, ఈ నాణేలు జాతీయ వారసత్వ సంపద అని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఘటనా స్థలం నుంచి నాణేలను దొంగిలించిన గ్రామస్తులు, ట్రాక్టర్ డ్రైవర్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఎవరి వద్దనైనా నాణేలు ఉంటే వెంటనే అప్పగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
