AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi-Biden: ఫ్రదాని మోదీతో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ వర్చువల్ భేటీ.. ప్రధాన ఎజెండా అదేనా?

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో అనేక ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Modi-Biden: ఫ్రదాని మోదీతో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ వర్చువల్ భేటీ.. ప్రధాన ఎజెండా అదేనా?
Modi Biden Meet
Balaraju Goud
|

Updated on: Apr 11, 2022 | 9:53 PM

Share

Modi – Biden Virtual Meeting: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాని(Russia Ukraine War)కి సంబంధించి అమెరికా(America) దూకుడుగా వ్యవహరిస్తోంది. రష్యాపై అనేక రకాల ఆంక్షలు విధించిన అమెరికా, ఇతర దేశాలకు కూడా అదే విధంగా సలహాలు ఇస్తోంది. ఇదే క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden), భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ల వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిడెన్ మాట్లాడుతూ, ‘ప్రధాని మోదీని కలవడం ఎల్లప్పుడూ సంతోషకరమైన విషయమన్నారు. ప్రపంచ సంక్షోభాలు, కోవిడ్ మహమ్మారి, ఆరోగ్య రంగంలో సవాళ్లపై కలిసి పని చేస్తున్నామని తెలిపారు. రక్షణ రంగంలో కూడా బలమైన భాగస్వాములుగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. బుచ్చా హత్యాకాండను తీవ్రంగా ఖండించామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు మానవతా సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు.

ఈ వర్చువల్ సమావేశంలో అనేక ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు రష్యా ప్రస్తావన తీసుకురావచ్చని చెబుతున్నారు. అలాగే ఈ భేటీలో రష్యాపై తమ వైఖరిని మరింత కఠినతరం చేయాలని భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా జరిగినట్లు సమాచారం. కరోనా మహమ్మారి, వాతావరణ సంక్షోభం వంటి అంశాలపై ప్రధాని మోదీ, బిడెన్ చర్చించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోని రెండు పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా మనం సహజ భాగస్వాములమని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చాలా కలవరపెడుతున్న తరుణంలో మా మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. బుచ్చాలో జరిగిన నరమేధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇటీవల బుచ్చా ప్రాంతంలో అమాయక పౌరులను చంపేస్తున్నారనే వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. వెంటనే ఖండిస్తూ పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలు శాంతి మార్గానికి దారితీస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో నేను మాట్లాడానని ప్రధాని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని అధ్యక్షుడు పుతిన్‌కు సూచించానని మోదీ పేర్కొన్నారు.

అదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు బిడెన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో భయంకరమైన దాడిలో బాధితులైన ప్రజలకు భారతదేశం మానవతా మద్దతును నేను స్వాగతిస్తున్నాను. మేము బలమైన ప్రగతిశీల రక్షణ భాగస్వామ్యాన్ని పంచుకుంటామని స్పష్టం చేశారు.

ఈ భేటీపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ట్వీట్ చేశారు. ఈ రోజు ఉదయం నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ మీటింగ్ చేస్తున్నాని అని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య మరిన్ని సత్సంబంధాల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ల మధ్య సమావేశం ముగిసిన వెంటనే భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల సమావేశం కూడా జరగనుంది. ఇందుకోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. బిడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా, భారత్‌ల మధ్య జరుగుతున్న తొలి 2+2 మంత్రివర్గ సమావేశం ఇదే. ఈ సమావేశంలో రక్షణ సహా అన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.

భారత్ వైఖరిపై అమెరికా ఆగ్రహం? రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం తరువాత, భారతదేశం వైఖరి తటస్థంగా ఉంది. భారత్ ఏ బహిరంగ వేదికలోనూ రష్యాను బహిరంగంగా విమర్శించలేదు. రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ అందులో పాల్గొనలేదు. రెండు దేశాలు కాల్పుల విరమణ చేయాలని భారత్ నుంచి మాత్రమే చెబుతున్నారు. అలాగే మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో, రష్యాకు వ్యతిరేకంగా గళం విప్పాలని అమెరికా అన్ని పెద్ద దేశాలకు సూచించింది. భారత్ అనుసరిస్తున్న ఈ వైఖరి అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపిందని చెప్పారు. ఈ అంశంపై ఇప్పుడు ప్రధాని మోదీ, బిడెన్‌ల భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

Read Also… ADR Report: కార్పొరేట్ సంస్థల నుండి అత్యదిక విరాళాలు అందుకుంటున్న పొలిటికల్ పార్టీ ఏదో తెలుసా..?