మన దేశానికి పక్కలో బల్లెంలా మారిన పాక్ చైనా లాంటి దేశాలకు దడ పుట్టించే ప్రిడేటర్ డ్రోన్స్ దూసుకొస్తున్నాయి. భారత్ చేతిలో ఈ డ్రోన్ అస్త్రాలు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించనున్నాయి. యస్. భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త అందించింది. భారత్‌కు 31 ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు నోటిఫై చేస్తూ అవసరమైన ధ్రువీకరణను అందజేసినట్లు రక్షణ భద్రత సహకార సంస్థ పేర్కొంది.
అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగనుంది.
భారత్‌తో ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయం చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారత్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఇక, అమెరికా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు దిశగా పెద్ద ముందడుగు పడింది. ఈ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. సముద్ర మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. మరోవైపు.. ఈ ప్రతిపాదిత ఒప్పందం కింద భారత్.. తన నౌకాదళం కోసం 15 సీ గార్డియన్ డ్రోన్లు, వైమానిక దళం, సైన్యం కోసం ఎనిమిదేసి చొప్పున స్కై గార్డియన్ డ్రోన్లను సమకూర్చుకోనుంది. కాగా, భారత నౌకాదళం ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..