UP Power Strike: అంధకారంలో ఉత్తరప్రదేశ్‌.. కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల నిరవధిక సమ్మె..!

|

Mar 19, 2023 | 12:38 PM

UP Power Strike: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 72 గంటలుగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. పీలోని చాలా గ్రామీణ ప్రాంతాలు శనివారం అంధకారంలో మునిగిపోయాయి.

UP Power Strike: అంధకారంలో ఉత్తరప్రదేశ్‌.. కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల నిరవధిక సమ్మె..!
Electricity
Follow us on

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 72 గంటలుగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సర్వీసుల క్రమబద్ధీకరణ, బోనస్‌ తదితర డిమాండ్‌లతో ఆందోళనకు దిగారు ఉద్యోగులు. దీంతో సమ్మెలో పాల్గొన్న 1332 మంది కాంట్రాక్టు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. యుపిలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 22 యూనియన్ నాయకులపై ఎస్మా ప్రయోగించింది. సమ్మె చేస్తున్న ఉద్యోగుల నేతలపై ఇప్పటి వరకు 29 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

సమ్మె చేస్తున్న ఉద్యోగులు ఒత్తిడికి తలొగ్గేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభానికి తెర లేచింది. యూపీలోని అన్ని డిస్కమ్‌లు, జనరేటింగ్ యూనిట్ల ఉద్యోగులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. సమ్మె కారణంగా ఓబ్రా, అన్‌పరా, పరిచా ఉత్పత్తి యూనిట్లు కుంటుపడగా, యూపీలోని చాలా గ్రామీణ ప్రాంతాలు శనివారం అంధకారంలో మునిగిపోయాయి. సమ్మె కారణంగా ప్రయాగ్‌రాజ్, వారణాసి, మీరట్ మరియు కాన్పూర్‌తో సహా అనేక పెద్ద నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ప్రైవేట్ ఆపరేటర్ లతో బలవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నారు విద్యుత్ ఇంజనీర్స్.

అటు విద్యుత్ సరఫరా లేక ఉత్తరప్రదేశ్ లోని అన్ని ప్రధాన పట్టణాలు, గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాత్రిళ్లు కరెంట్ లేక నరకం అనుభవిస్తున్నాం అని యూపీ సీఎం పై మండిపడుతున్నారు. పరీక్షల సమయంలో రోజుల కొద్దీ ఇలా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రభుత్వంపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు మద్దతు తెలిపిన నేషనల్ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ శైలేంద్ర ధోబే,కన్వీనర్ రత్నాకర్ రావు.

శనివారం సాయంత్రం యుపి ఇంధన శాఖ మంత్రి ఎకె శర్మ యుపి పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ ఫ్రంట్ నాయకులను తన నివాసంలో చర్చల కోసం పిలిచారు. అయితే, ఈ చర్చలు ఫలించలేదు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ సమ్మె విద్యుత్ సరఫరాపై స్వల్ప ప్రభావం మాత్రమే చూపుతుందని అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు తిరిగి విధుల్లో చేరేందుకు నాలుగు గంటల సమయం ఇచ్చారని, లేని పక్షంలో కాంట్రాక్టు సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని బెదిరించారు. అయితే సమ్మెలో ఉన్న ఉద్యోగులు నిరాకరించడంతో ఆయన విజ్ఞప్తి ఫలించలేదు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి శాంతింపజేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు.

సమ్మె చేస్తున్న ఉద్యోగుల నాయకుడు, ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర దూబే మాట్లాడుతూ యూనియన్ ప్రతినిధులు ఎవరినీ చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో విద్యుత్ ఉద్యోగుల సంఘం గతంలో చేసుకున్న ఒప్పందంలో సమాన పనికి సమాన వేతనం ఉంటుందని స్పష్టంగా చెబుతున్నా అమలుకు నోచుకోలేదన్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1332 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి, యూనియన్ నాయకులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల నాయకులు జనరేషన్‌ ప్లాంట్‌లలో విధ్వంసానికి పాల్పడుతున్నారని, ఇందులో వాస్తవం లేదన్నారు. ఈ ఆరోపణపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన కోరారు. శుక్రవారం నుంచి ఉద్యోగులెవరూ విధుల్లో చేరలేదని, ఇప్పటికీ తమ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తూనే ఉందని దూబే అన్నారు. ఉద్యోగుల్లో ఎవరినైనా అరెస్టు చేసినా, జరిమానా విధించినా సంపూర్ణ సమ్మె చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగులు అణిచివేత చర్యలు చేపడితే జైల్ భరోకు పిలుపునివ్వాలన్నారు. తొలగించిన సిబ్బందిని వెనక్కి తీసుకున్న తర్వాతే విద్యుత్ ఉద్యోగులు విధుల్లో చేరుతారని యూనియన్ నాయకులు తేల్చి చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..