ఓ పెళ్లి వేడుకలో వింత ఘటన ఎదురైంది. పెళ్లి విందు చపాతీలు వడ్డించడం ఆలస్యమైనందుకు ఓ వరుడు, అతడి కుటుంబ సభ్యులు వధువు కుటుంబీకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. అంతేకాదు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి పీటలమీద నుంచి వెళ్లిపోయిన వరుడు అనంతరం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డిసెంబర్ 22వ తేదీన తన కుటుంబం, బంధువులతో కలిసి వరుడు మెహతాబ్ పెళ్లి ఊరేగింపుగా హమీద్‌పూర్ గ్రామానికి చేరుకున్నాడు. అయితే పెళ్లి భోజనం వడ్డించారు. అయితే ఇందులో చపాతీలు వడ్డించడం ఆలస్యం కావడంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు వారిపై ఆగ్రహించారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వారిని నచ్చజెప్పినా ఎంతకి వినిపించుకోలేదు. చివరకు పెళ్లి మధ్యలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
కాగా, అక్కడి నుంచి వెళ్లిపోయిన వరుడు మెహతాబ్ ఆ రాత్రికే బంధువైన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తీవ్ర అవమానానికి గురైన వధువు, ఆమె కుటుంబ సభ్యులు.. వరుడు, అతని కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డిసెంబర్ 24న జిల్లా ఎస్పీని కలిశారు. పెళ్లి కోసం ఏడు లక్షలు ఖర్చు చేశామని, వరుడికి కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. పెళ్లిని మధ్యలో వదిలేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడని హిందూస్తాన్ టైమ్స్ నివేదించింది. వరుడు మెహతాబ్, అతడి కుటుంబంపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు వధువు కుటుంబ సభ్యులు.
మరిన్ని జాతీయ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి