ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే ప్రజలు గొడవలు, ఘర్షణలకు దిగుతున్నారు. పెంపుడు కుక్కలు, పిల్లల విషయంలో కూడా ఇరుగు పొరుగు వారు తలలు పగిలేలా కొట్టుకుంటున్న ఘటనలు కూడా అనేకం చూస్తున్నాం. పక్కింటి పెంపుడు కుక్క తమ ఇంట్లోకి వస్తుందని, తుపాకీతో కాల్చిన ఘటనలు కూడా చూశాం. అయితే, తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలో చోటు చేసుకుంది. కుక్క మొరిగే విషయంలో ఇరువర్గాల మధ్య రక్తపాతం, హింసాత్మక ఘర్షణ జరిగింది. ఈ వివాదంలో ఒక మహిళ మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగౌలీ గ్రామంలో కుక్క మెరిగే విషయమై ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వివాదంలో 50 ఏళ్ల మహిళ మృతి చెందగా ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే సోన్‌బర్సాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి పంపారు. కానీ, చికిత్స పొందుతూనే ఆ మహిళ మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మృతురాలు లాల్ ముని కుమారుడు సోను ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులు శివసాగర్ బింద్, అతని కుమారుడు అజిత్‌లను అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. గొడవకు కారణమైన కుక్క ఇప్పటికే చాలా మందిని కరిచి గాయపరిచినట్టుగా తెలిసింది. దాని యజమాని తన పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసి వెళ్లటంతో అది.. తరచూ రోడ్డుపై వచ్చేపోయే వారిని కరిచి గాయపరుస్తుందని చెప్పారు. కుక్క కరిచిందని లాల్‌ముని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు రావడంతో అతని కుటుంబ సభ్యులకు, కుక్క యజమానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయటంతో లాల్‌ముని ప్రాణాలు కోల్పోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.