Vande Bharat: ప్రమాదాలకు నిలయంగా వందే భారత్.. గత ఆరు నెలల్లో ఎన్ని జరిగాయంటే.. కేంద్ర మంత్రి క్లారిటీ..
ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆరు రూట్లలో సేవలు అందిస్తున్న...

ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆరు రూట్లలో సేవలు అందిస్తున్న ఈ రైళ్లకు ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 68 సార్లు ప్రమాదాలకు గురైంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డిసెంబర్ 14న లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఆరు నెలల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎన్ని జంతువులను ఢీకొన్నాయో తెలపాలన్న ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. వందేభారత్ కోచ్ షెల్ స్ట్రక్చర్ హైగ్రేడ్ స్టీల్‌తో తయారైందని కేంద్ర రైల్వే మంత్రి మరో సమాధానంలో తెలిపారు. అయితే.. రైలుకు ఏరోడైనమిక్ ప్రొఫైల్‌ను అందించేందుకు వందే భారత్ రైలు ముందు అమర్చిన కప్లర్ కవర్ హిట్ ప్రభావం కోసం ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ కారణంగానే ప్రమాదాలకు గురైనప్పుడు తీవ్రత అధికంగా ఉంటోంది.
ప్రస్తుతం వందే భారత్ రైళ్లు గరిష్టంగా 500 నుంచి 550 కిలోమీటర్ల దూరం వరకు సిట్టింగ్ కెపాసిటీతో నడుస్తున్నాయి. వందే భారత్ 2.0 కేవలం 52 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని, అంతే కాకుండా గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్నీ చేరుకుంటాయన్నారు. మునుపటి వెర్షన్ 430 టన్నులతో పోలిస్తే 392 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో వైఫై సదుపాయం కూడా ఉంటుంది. మునుపటి వెర్షన్‌లోని 24తో పోలిస్తే ప్రతి కోచ్‌లో 32″ స్క్రీన్‌లు ప్రయాణీకులకు సమాచారం అందిస్తాయి. పర్యావరణహితంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను రూపొందించారు. వీటిలో ఉపయోగించే ఏసీలు15 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో దుమ్ము రహిత శుభ్రమైన గాలి శీతలీకరణతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త డిజైన్‌లో, గాలిని శుభ్రపరిచేందుకు రూఫ్-మౌంటెడ్ ప్యాకేజీ యూనిట్ లో ఫొటో-ఉత్ప్రేరక అతినీలలోహిత గాలి శుద్దీకరణ వ్యవస్థ ను రూపొందించారు. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్, చండీగఢ్ సిఫార్సు మేరకు.. గాలి ద్వారా వచ్చే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మొదలైన వాటి నుంచి గాలిని ఫిల్టర్ చేయడానికి, శుభ్రం చేయడానికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..



