మణిపూర్‌లోఇద్దరు మహిళలను వివస్త్రను చేసి రోడ్డుపై ఊరేగించిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించిన విషయం విధితమే. తాజాగా ఇదే విషయమై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘూటాగా స్పందించారు. ఇలాంటి ఘటనలు దేశానికి తలవంపులు తెస్తున్నాయన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ ఇలా ఏ రాష్ట్రమైనా మహిళలపై నేరాలు జరిగినా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని చెబుతున్నారని, అయితే దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు దానిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాయి.
ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని పార్లమెంట్‌లో చెప్పామని, అయితే విపక్షాలు చర్చకు దూరంగా ఉంటున్నాయని కేంద్ర మంత్రి విమర్శించారు. చర్చకు దూరంగా పారిపోవాలని ఎందుకు చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇక రాజస్థాన్ గురించి ప్రస్తావించిన కేంద్ర మంత్రి.. రాజస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. గడిచిన 54 నెలల్లో 10 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 7500 మందికి పైగా అమాయకులు హత్యకు గురయ్యారు. లక్షా 90 మంది మహిళలపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయన్నారు.
అలాగే రాజస్థాన్‌లో 33 వేల అత్యాచార ఘటనలు జరిగాయన్న కేంద్ర మంత్రి.. ఈ గణాంకాలు చాలా విషయాలు చెబుతున్నాయన్నారు. రాజస్థాన్‌లో దళితులు, దళిత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు నిరంతరం పెరుగుతున్నాయన్నారు. దేశంలో అత్యాచారాల కేసుల్లో రాజస్థాన్ పేరు మొదటి స్థానంలో ఉందన్నారు. జైపూర్‌లోని వైశాలి నగర్‌లో సీఎం ఇంటికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఓ మహిళపై తన పదేళ్ల కుమారుడి ఎదుటే అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటనపై ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఠాకూర్ ప్రశ్నించారు. కేవలం ఒక రాష్ట్రంలో మహిళపై జరిగిన దాడిపై మాత్రమే స్పందిస్తారా.? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలు, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు ఎందుకు స్పందించరని మంత్రి అన్నారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌లో లోపల , బయట కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి విపక్షాలు. మణిపూర్ ఘటనలపై తక్షణమే చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక కేంద్రం కూడా.. తాము చర్చకు సిద్దమేనని స్పష్టం చేసినప్పటికీ.. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. కాగా, తమ ప్రభుత్వం మణిపూర్ ఘర్షణలపై చర్చకు సిద్దంగా ఉన్నప్పటికీ.. విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..