Gas Subsidies: కేంద్ర సర్కార్ 2011-12 నుంచి ఇప్పటివరకు సుమారు రూ .7.03 లక్షల కోట్ల గ్యాస్ సబ్సిడీలను చెల్లించిందని పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి, రామేశ్వర్ వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై లోక్‌సభలో స్పందిస్తూ వివరాలు వెల్లడించారు. దేశంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ముడిచమురుల ధరలపై ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్పీజీ సబ్సిడీ కోసం కేటాయింపులను మూడింట రెండు వంతులు తగ్గించిన విషయాన్ని వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు రూ. 12,995 కోట్లకు తగ్గించిన నేపథ్యంలో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర పెరిగిందని ఆయన తెలిపారు. ఎల్‌పిజి అండ్ నేచురల్ గ్యాస్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ. 12,995 కోట్లని ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, భారత్‌లో జనవరి 1, 2021 నాటికి 28.74 కోట్ట మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారని ఆయన సభలో వెల్లడించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కవరేజీని 61.5శాతం నుంచి 99.5 శాతానికి పెరిగిందని తెలిపారు.