MP Quota in KV’s: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా పునరుద్ధరణపై విద్యాశాఖ క్లారిటీ ఇదే..!
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఎంపీ కోటాను పునరుద్ధరించాలనే ప్రతిపాదన ఏదీ లేదు. రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బంది తరచూ బదిలీలపై వెళ్తుంటారు. వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా, వారి విద్యావసరాలు తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు..
న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటాను గతేడాది కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల (కేవీ) ప్రవేశాల్లో ఎంపీ కోటాను మళ్లీ పునరుద్ధరిస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి సోమవారం క్లారిటీ ఇచ్చింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఎంపీ కోటాను పునరుద్ధరించాలనే ప్రతిపాదన ఏదీ లేదు. రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బంది తరచూ బదిలీలపై వెళ్తుంటారు. వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా, వారి విద్యావసరాలు తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు వీలుగా ప్రధానంగా కేవీలను ప్రారంభించారు. కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ సహా ఇతర కోటాలను అనుమతించడం వల్ల తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా సెక్షన్‌కు 40 మంది విద్యార్థుల కంటే సంఖ్య పెరిగిపోతోంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే వాటిని రద్దు చేశాం. ఎంపీ కోటాను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని మంత్రి తన సమాధానంలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వందల కేవీలు ఉన్నాయి. వీటిల్లో 14.35 లక్షల విద్యార్ధులు చదువుతున్నారు. కాగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీ కోటాతో సహా ఇతర కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో కేంద్రం రద్దు చేసింది. ఇందులో ఎంపీ కోటా కూడా ఉంది. గతంలో ఒక్కొక్క ఎంపీ 10 మంది విద్యార్ధుల చొప్పున 788 మంది ఎంపీలు 7,880 మంది విద్యార్థులను సిఫార్సు చేసే వీలుండేది. అలాగే జిల్లా మేజిస్ట్రేట్‌లకు కూడా 17 మంది విద్యార్థులను సిఫార్సు చేసే అధికారం ఉండేది.
ఈ కోటాలన్నింటినీ తొలగించడం వల్ల కేంద్రీయ విద్యాలయాల్లో దాదాపు 40 వేలకు పైగా సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ కోటాల కింద విద్యా మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పిల్లలు, ఎంపీల పిల్లలు, కేవీల విశ్రాంత ఉద్యోగుల పిల్లలు ఇలా వివిధ కోటాల్లో ప్రత్యేక ప్రవేశాలను కల్పించేవారు. వీటన్నింటినీ కేంద్రం రద్దు చేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అవకాశాలు మెరుగయ్యాయి. ఐతే జాతీయ శౌర్య పురస్కార గ్రహీతలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉద్యోగులు, విధి నిర్వహణలో మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం కల్పించే కోటాలను కేంద్రం కొనసాగించనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.