MS Dhoni: విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని గణాంకాలు..
Chennai Super Kings: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.

MS Dhoni: రాయల్ ఛాలెంజంర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన చెన్నై టీంపై అన్ని వైపుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఈ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడం పట్ల చాలా మంది దిగ్గజాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 9వ నంబర్‌లో బ్యాటింగ్ చేయాల్సి రావడం తప్పని, అసలు ధోని జట్టులో ఉండటం వల్ల ఉపయోగం ఏమిటని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ధోని చెత్త గణాంకాలు బయటకు వచ్చాయి. ఈ లెక్కలు 43 ఏళ్ల లెజెండ్ ఇకపై చెన్నై తరపున మ్యాచ్ విన్నర్ కాదని రుజువు చేసేలా ఉన్నాయి.
ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రశ్నలు..
ఐపీఎల్ 2023 సీజన్ నుంచి ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి. కానీ, ధోని ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. 43 సంవత్సరాల వయస్సులో కూడా ఐపీఎల్‌లో సందడి చేస్తూనే ఉన్నాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ధోని తన బ్యాటింగ్ ఆర్డర్‌ను గణనీయంగా తగ్గించుకున్నాడు. అందుకే, గత రెండేళ్లలో, చెన్నై విజయానికి అతని సహకారం పెద్దగా లేకుండా పోయింది. అయితే, ఓడిపోయిన మ్యాచ్‌లలో మాత్రం ఎక్కువ పరుగులు సాధించడం విస్మయానికి గురి చేస్తోంది.
ధోని గణాంకాలు ఎలా ఉన్నాయంటే?
2023 ఐపీఎల్ సీజన్‌లో ధోని గణాంకాలను పరిశీలిస్తే.. అతను చెన్నై విజయంలో కేవలం మూడు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. తొమ్మిది బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క ఫోర్ లేదా సిక్స్ కూడా తన ఖాతాలో చేరలేదు. చెన్నై టీం ఛేజింగ్‌లో ఓడిపోయిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ధోని ఐదు ఇన్నింగ్స్‌లలో 73 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 12 సిక్సర్లు నమోదయ్యాయి.
ధోని వయస్సు పెరుగుతున్న కొద్దీ, అతను ఇకపై చెన్నై సూపర్ కింగ్స్‌కు మ్యాచ్ విన్నర్ కాదని ఈ గణాంకాల నుంచి స్పష్టమవుతోంది. ఈ సీజన్‌లోని రెండు మ్యాచ్‌లలో ధోని వికెట్ కీపింగ్‌లో అద్భుతాలు చేశాడు. కానీ, బ్యాటింగ్‌లో అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఐపీఎల్‌లో ధోని ఇప్పటివరకు 266 మ్యాచ్‌ల్లో 5273 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..