Sweeper Jobs: నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే వార్త ఇది.. రోడ్లు ఊడ్చే పనికి ఏకంగా 46 వేల గ్రాడ్యుయేట్ల పోటీ
దేశంలో ఏ రాష్ట్రంలో చూసిన నిరుద్యోగ తీవ్రత భూతంలా కోరలు చాస్తోంది. యేటా లక్షలాది పట్టభద్రులు ఎన్నో ఆశలతో కాలేజీల నుంచి వస్తుంటే.. ఉద్యోగాలు మాత్రం కేవలం సింగిల్ డిజిట్‌లో మాత్రమే దొరుకుతున్నాయి. చదివిన డిగ్రీకి న్యాయం చేయలేకపోయినా.. ఏ పనైతేనేం కడుపు నింపుకోవడానికి అన్న చందంగా నానాటికీ దిగజారిపోతున్నారు నిరుద్యోగులు. తాజాగా రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలకు..
ఛండీగఢ్, సెప్టెంబర్ 4: దేశంలో ఏ రాష్ట్రంలో చూసిన నిరుద్యోగ తీవ్రత భూతంలా కోరలు చాస్తోంది. యేటా లక్షలాది పట్టభద్రులు ఎన్నో ఆశలతో కాలేజీల నుంచి వస్తుంటే.. ఉద్యోగాలు మాత్రం కేవలం సింగిల్ డిజిట్‌లో మాత్రమే దొరుకుతున్నాయి. చదివిన డిగ్రీకి న్యాయం చేయలేకపోయినా.. ఏ పనైతేనేం కడుపు నింపుకోవడానికి అన్న చందంగా నానాటికీ దిగజారిపోతున్నారు నిరుద్యోగులు. తాజాగా రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలకు డిగ్రీలు, పీజీలు చదివిన యువత వేల సంఖ్యలో పోటీ పడిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ (హెచ్‌కేఆర్‌ఎన్) డాటా వెల్లడించిన విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.
హర్యానాలో యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ సంస్థ ఇది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీల్లోని ఉద్యోగాలను ఈ సంస్థ భర్తీ చేస్తుంది. తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం హెచ్‌కేఆర్‌ఎన్ ప్రకటన జారీ చేయగా.. దరఖాస్తులు వెళ్లువెత్తాయి. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 వరకు మొత్తం 46,102 మంది గ్రాడ్యుయెట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39,990 మంది పట్టభద్రులు, 6,112 మంది పీజీ చదివిన వారు ఉండటం విశేషం. వీరుకాకుండా 12వ తరగతి పూర్తి చేసిన మరో 1,17,144 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా మొత్తం మొత్తం 3.95 లక్షల మంది వ్యక్తులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలా పోటీ పడుతుంటే ఇవేవో శాశ్వత ఉద్యోగాలు అనుకుంటే పొరబాటే. కేవలం రూ.15 వేల అతి తక్కువ జీతంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కల్పించే ఉద్యోగాలివి.
ఏదో పొరపాటున దరఖాస్తు చేసుకున్నారేమో అనడానికి కూడా వీలు లేదు. ఉద్యోగ ప్రకటనలోనే రోడ్లు, బహిరంగ ప్రదేశాలను ఊడ్చడం, శుభ్రం చేయడం, చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం ముందే పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు, పీజీలు చదివిన గ్రాడ్యుయేట్లు పోటీపడటం ఉలిక్కిపడేలా చేస్తుంది. దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై 29 యేళ్ల నర్సరీ టీచర్స్ ట్రైనింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఓ యువతి మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఒక్క ఉద్యోగం రాలేదు. ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. అందుకే స్వీపర్ ఉద్యోగమైనా పర్లేదని దరఖాస్తు చేసుకున్నానని దుఃఖం దిగమింగుకుంటూ చెప్పుకొచ్చింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీతో గ్రాడ్యుయేట్ అయిన మరో యువకుడు మాట్లాడుతూ.. నేను నిరుద్యోగిని. మాది నిరుపేద కుటుంబం. ఈ ఉద్యోగంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్, హర్యానా రోడ్‌వేస్ బస్ కండక్టర్ ఉద్యోగాల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. ఇలా ఎవరిని కదిలించినా.. గుండె తరుక్కుపోయే కథనాలే.
గత పడేళ్లలో 1.45 లక్షల ఉద్యోగాలిచ్చాం.. సీఎం నయాబ్ సైనీ
దీనిపై ముఖ్యమంత్రి నయాబ్ సైనీ మాట్లాడుతూ.. గత పదేళ్లలో తమ ప్రభుత్వం 1.45 లక్షల సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిందన్నారు. అంతేకాకుండా 37 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. HKRN ద్వారా దాదాపు 1.20 లక్షల మందిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. మొత్తం పదేళ్లలో కనీసం 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోవడం సీఎం మాటలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం హర్యానాలోని పట్టణ ప్రాంతాల్లో 15-29 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలోనే ఏకంగా 11.2%కి పెరిగిందంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.