కర్ణాటకలో మంకీ ఫీవర్.. ఇద్దరు మృతి

కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న తరుణంలో.. భారత్‌లో వివిధ రకాల వైరస్‌లు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కోళ్లకి ఓ వింత వైరస్ సోకి..

  • Tv9 Telugu
  • Publish Date - 3:55 pm, Sun, 1 March 20
కర్ణాటకలో మంకీ ఫీవర్.. ఇద్దరు మృతి

కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న తరుణంలో.. భారత్‌లో వివిధ రకాల వైరస్‌లు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కోళ్లకి ఓ వింత వైరస్ సోకి వేలల్లో మరణిస్తున్నాయి. అలాగే ఏపీ వ్యాప్తంగా ‘రుగోస్ వైరస్‌’తో పండ్ల తోటలు నాశనమవుతుండగా.. ఇప్పుడు మరో ప్రమాదకర వైరస్ తన ఉనికిని చాటుకుంటోంది. అదే ‘మంకీ ఫీవర్’ వైరస్‌. ఈ ప్రమాదకర వైరస్ కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ఈ ఫీవర్‌ను కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గుర్తించారు. ఇప్పటికే 55 మంది ఈ మంకీ ఫీవర్ బారిన పడినట్టు అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ వ్యాధిని కైసనూరు ఫారెస్ట్ డిసీజ్‌గా వ్యవహరిస్తారు. దీనికే ‘మంకీ ఫీవర్’ అనే మరో పేరు కూడా ఉంది. మంకీ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ ఫీవర్‌తో సిద్ధపుర తాలుకాకు చెందిన భాస్కర్ గణపతి హెగ్డే(64)తో పాటు మరో మహిళ మృతి చెందారని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే.. ఈ ఫీవర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. కాస్త ఫీవర్‌గా అనిపించినా.. వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

మంకీ ఫీవర్ లక్షణాలు:

1. వారం వరకూ లక్షణాలు కనబడవు
2. ఆ తరువాత జ్వరం, తలనొప్పి, నరాల బలహీనత, వాంతులు, తిమ్మిర్లు వస్తాయి
3. బీపీ, ఎర్రరక్త కణాలు తగ్గిపోవడం కనిపిస్తుంది
4. ఈ వ్యాధి మరింత తీవ్రం అయ్యాక, నోరు, పంటి చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది.
5. ఇది పెరిగితే మనిషి మతి స్థిమితం కోల్పోయే అవకాశం ఉందట.