ప్రశాంత వాతావరణం, మంచు కొండల చల్లదనంతో భూలోక స్వర్గంగా విరాజిల్లుతోన్న జమ్ము కశ్మీర్‌లో (Jammu and Kashmir) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ (Sopor) ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత గాలింపు చేపట్టాయి. సోపోర్ టౌన్‌లోని బొమై ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో రక్షణ కోసం భద్రతా బలగాలు ఇద్దరిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మహ్మద్ రఫి, కైసర్ ఆశ్రఫ్‌గా గుర్తించారు. మరో ఘటనలో సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. వారిని లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు.
కాగా.. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీసు అమరుడయ్యారు. చనిపోయిన ముష్కరులు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారని నిర్ధరించారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బారాముల్లా జిల్లా క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ముష్కరుల కాల్పుల్లో గాయపడి, ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..