జమ్ము కశ్మీర్ ను వరస బాంబు పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలు తీవ్ర కలకలం సృష్టించింది. ఉధంపూర్ లో ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. రెండు బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం రాత్రి 10.30 సమయంలో దొమాయిల్ చౌక్‌లోని ఓ పెట్రోల్ పంప్ సమీపంలో బస్సును పార్క్ చేశారు. బస్సులోని డ్రైవర్ క్యాబిన్ లో కండక్టర్ సునీల్ సింగ్, మరో వ్యక్తి ఉన్నారు. ఈ బస్సు నిత్యం ఉధంపూర్-రామ్‌ఘర్-బసంత్‌ఘర్‌కు ప్రయాణికులను చేరవేస్తోంది. అలా ప్రయాణీకులను దింపి వచ్చిన తర్వాత బస్సును నిలిపి ఉంచారు. కాగా ఆ సమయంలోనే బస్సులో పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వారిద్దరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఇది జరిగిన కొన్ని గంటలకే ఉధంపూర్‌లో మరో బస్సులో పేలుడు సంభవించడం తీవ్ర కలకలంగా మారింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఉధంపూర్ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరో మూడు రోజుల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుండగా ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది.ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..