Tungabhadra dam: తుంగభద్ర గేటు ప్రమాదానికి కారణాలేంటి? రిపేర్ చేయడానికి ఎంత సమయం?

|

Aug 11, 2024 | 4:50 PM

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు రిపేర్ అయ్యేదెలా? రిపేర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఈ సందేహం మూడు రాష్ట్రాల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. సమస్య సంక్లిష్టంగా ఉండటంతో ఎలా పరిష్కరించాలనే విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Tungabhadra dam: తుంగభద్ర గేటు ప్రమాదానికి కారణాలేంటి? రిపేర్ చేయడానికి ఎంత సమయం?
Tungabhadra Dam
Follow us on

తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన ఘటనపై కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉన్నతాధికారులు.. డ్యామ్ దగ్గర పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల బృందాన్ని పంపించింది. డ్యామ్ దగ్గరకు చేరుకున్న నిపుణుల బృందం.. గేటు కొట్టుకుపోవడానికి కారణాలపై ఆరా తీశారు. ఏ రకంగా పునరుద్ధరించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. స్టాప్‌లాక్‌ ఎలిమెంట్స్ ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చా లేదా అనే అంశంపై చర్చిస్తున్నారు. దీనిపై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వరద రాకముందే గేట్లు తనిఖీ చేశామంటున్న అధికారులు.. పటిష్టంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందించామంటున్నారు. గేట్లపై ఒత్తిడి పెరగడంతో గేటు కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

డ్యామ్ కింద కర్నాటకలో 9 లక్షల 26 వేల ఎకరాలు, ఆంధ్రా, తెలంగాణలో మరో మూడు లక్షల 40 వేలు కలిపి మొత్తం 12 లక్షల 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యాంను పరిశీలించిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. మూడు రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేశారు. వీలైనంత త్వరగా గేట్‌ను రిపేర్ చేస్తామన్న డీకే.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

రాయలసీమ రైతులకు తుంగభద్ర డ్యామ్‌ జీవనాధారం. అనంతపురం, కర్నూలు జిల్లాలకు గుండెకాయలాంటిది. దీన్ని నమ్ముకొని రైతులు లక్షలాది ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోయిన ఘటనపై ఏపీ సీఎం చంద్రాబాబు ఆరా తీశారు. డ్యామ్‌ బోర్డుకు అవసరమైన సాయం అందించారని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

తుంగభద్ర డ్యామ్‌.. పూర్తి సామర్ధ్యం 105 టీఎంసీలు. పూర్తి స్థాయిలో నిండి నిండుకుండలా మారింది. తాజా నిల్వలను అంచనా వేస్తే 65 నుంచి 70 టీఎంసీల నీటిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు. 32 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వేకి దిగువకు వాటర్‌ లెవల్‌ తగ్గితేనే 19వ క్రస్ట్‌గేట్‌ రిపేర్‌ సాధ్యమని చెబుతున్నారు. అందుకే డ్యామ్‌లో నీటిమట్టాన్ని 20 అడుగులకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 69 ఏళ్ల తుంగభద్ర డ్యామ్‌ చరిత్రలో మొదటిసారి ప్రమాదం జరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు స్టాప్‌ లాక్స్‌ పెట్టకపోవడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్టికల్‌ గేట్లు కావడంతో నీటిని ఆపడం కష్టమని చెప్తున్నారు. ఒకవేళ స్టాప్‌ లాక్స్‌ అమర్చాలంటే వారం రోజుల టైమ్ పడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.