తెలివి తెల్లారినట్లే ఉంది.. కిక్కు కోసం తాగితే ఏకంగా ప్రాణాలే పోయాయ్‌! జైల్లో ఖైదీల తింగరిపని

|

Jan 09, 2025 | 1:39 PM

న్యూ ఇయర్ వేడుకల కోసం జైల్లోని బేకరీలో పెద్ద మొత్తంలో కేకు తయారీ సామాగ్రి తీసుకొచ్చారు జైలు అధికారులు. అదే జైల్లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు వ్యక్తులు బేకరీ అనుభవం ఉంది. దీంతో వారిని కేకుల తయారీకి అధికారులు పురమాయించారు. బేకరీలోకి ప్రవేశించిన ముగ్గురు ఖైదీలు ఎదురుగా బాటిళ్లలో కేకు తయారీకి వాడే రసాయనాలు కనిపించాయి. అంతే వీటిని తాగితే మత్తు వస్తుందని భావించి ఎత్తిపట్టి తాగేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

తెలివి తెల్లారినట్లే ఉంది.. కిక్కు కోసం తాగితే ఏకంగా ప్రాణాలే పోయాయ్‌! జైల్లో ఖైదీల తింగరిపని
Cake Essence
Follow us on

మైసూరు, జనవరి 9: మైసూరు జైలులో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బేకరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఖైదీలు కేక్ ఎసెన్స్ తాగి మరణించారు. మృతులను మాదేష్, నాగరాజ్, రమేశ్‌గా గుర్తించారు. బేకరీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఈ ముగ్గురు ఖైదీలు తొలుత తాము కేక్‌ల తయారీలో వినియోగించే పదార్ధాలు తాగినట్లు చెప్పలేదు. అయితే వారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో జైలు సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు ఖైదీలు మృత్యువాత పడ్డారు.

జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం సంబరాల నేపథ్యంలో కేక్ తయారీ కోసం పెద్ద మొత్తంలో పదార్ధాలు తీసుకొచ్చారు. అందులో కేకుల తయారీలో వాడే కేక్‌ ఎసెన్సులు కూడా ఉన్నాయి. దీంతో బేకరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఈ ముగ్గురు ఖైదీలు మత్తు కోసం అక్కడి బేకరీ ఎసెన్సు తాగారు. డిసెంబర్‌ 26న వీరు ఎసెన్సులు తాగగా.. కాసేపటికే తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే తాము ఎసెన్సులను తాగిన సంగతి జైలు అధికారులకు తెల్పలేదు. దీంతో కడుపునొప్పితో విలవిల లాడుతుంటే అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స అందించినప్పటికీ వారి కడుపునొప్పి తగ్గకపోవడంతో, చివరికి వారిని సమీపంలోని మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురూ మృత్యువాత పడ్డారు. మాదేష్ మంగళవారం రాత్రి మృతి చెందగా, నాగరాజ్, రమేష్ బుధవారం మృతి చెందారు. కాగా మృతులు మాదేష్, నాగరాజ్, రమేశ్‌.. వివిధ నేరాల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు.

బేకరీలలో కేక్‌లకు రంగు, సువాసన రావడానికి ఎసెన్సును అతి స్వల్ప మొత్తంలో మాత్రమే వాడుతుంటారు. వీటిని తాగితే మత్తు వస్తుందని భావించిన ఖైదీలు.. తాగాక మత్తు రాకపోవడానికి బదులుగా తీవ్రమైన కడుపునొప్పికి గురయ్యారు. ఆలస్యంగా తాము ఎసెన్సు తాగిన విషయాన్ని చెప్పడంతో ఆప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ముగ్గురి ఆరోగ్యం విషమించింది. పోస్టుమార్గం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిచారు. దీనిపై మొహల్లా స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.