పేరుకే పేద రాష్ట్రం.. నేతలంతా కోటీశ్వర్లులే..!
ఆ రాష్ట్రం దేశంలో వెనుకబడిన ప్రాంతం. పేద ప్రజలే ఎక్కువ. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలంతా ధనికులే.
ఆ రాష్ట్రం దేశంలో వెనుకబడిన ప్రాంతం. పేద ప్రజలే ఎక్కువ. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలంతా ధనికులే. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో అసలు విషయాలు వెలుగుచూశాయి. ఇదీ బీహార్ రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు అక్టోబర్ 28న తొలి దశ, నవంబర్ 3న రెండో దశ, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో తొలి విడదలో ఎన్నికలు జరుగుతున్న 71 స్థానాలకు 1,065 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వీరిలో 153 మంది కోటీశ్వరులు కావడం గమనార్హం. మహా కూటమి ఆర్జేడీ-కాంగ్రెస్, లెఫ్ట్‌లో 58 శాతం మంది, ఎన్డీయే బీజేపీ-జేడీయూ-హెచ్‌ఏఎం(ఎస్), వీఐపీ అభ్యర్థుల్లో 60 శాతం మంది రూ. కోటి నుంచి రూ.53 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా తెలుస్తోంది.
బిహార్‌లోని అత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జేడీయూ నేత, ఎమ్మెల్సీ మనోరమ దేవి అందరిలోకెల్లా ధనికురాలు. ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం రూ.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొంది. చరాస్తులు రూ.26.18 కోట్లు, స్థిరాస్తులు రూ.27 కోట్లు ఉన్నట్లు ఆమె వెల్లడించింది. ఔరంగాబాద్ జిల్లా ‘కుటుంబ’ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ కుమార్ ఆస్తి విలువ రూ.33.6 కోట్లుగా పేర్కొన్నారు. నవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జేడీయూ నేత కౌషల్ యాదవ్ రూ.26.13 కోట్ల ఆస్తితో మూడోస్థానంలో నిలిచారు. ఆయనకు పోటీగా దిగిన ఆర్జేడీ అభ్యర్థి విభా దేవి కూడా కోటీశ్వరాలు కావడం విశేషం. ఆమె ఆస్తుల విలువ రూ. 22.47 కోట్లు. విభా దేవి ఆర్జేడీ నేత రాజ్‌వల్లభ్ ప్రసాద్ యాదవ్ సతీమణి. టాప్-10 మంది కోటీశ్వరుల్లో నలుగురు ఆర్జేడీ నుంచి, ముగ్గురు జేడీయూ, కాంగ్రెస్, ఎల్‌జీపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ పార్టీల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే, అన్ని పార్టీలు కూడా అండ బలం, అర్థ బలం చూపిన వారికి మాత్రమే సీట్లను కేటాయించారని బడుగు నేతలు ఆరోపిస్తున్నారు.