నిజాం వైభవానికి నిదర్శనం.. కల్బుర్గీ కట్టడాలు

నిజాం వైభవానికి నిదర్శనం.. కల్బుర్గీ కట్టడాలు

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్.. ఈయన ఎవరో తెలుసా.. హైదరాబాద్‌ను పాలించిన ఆఖరి ప్రభువు. ఆయన హైదరాబాద్ సంస్ధానాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్న తెలంగాణ చిత్రపటానికి మించి ఆయన పాలించిన భూభాగాలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో హైదరాబాద్ కర్ణాటక పేరుతో ఆరు జిల్లాలున్నాయి. కల్బుర్గీ రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఐవాన్-ఎ-షాహి ఒకటి. ఇది 19 శతాబ్దంలో నిర్మించిన అద్భుతమైన రాతి నిర్మాణంగా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 17, 2019 | 5:24 PM

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్.. ఈయన ఎవరో తెలుసా.. హైదరాబాద్‌ను పాలించిన ఆఖరి ప్రభువు. ఆయన హైదరాబాద్ సంస్ధానాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్న తెలంగాణ చిత్రపటానికి మించి ఆయన పాలించిన భూభాగాలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో హైదరాబాద్ కర్ణాటక పేరుతో ఆరు జిల్లాలున్నాయి. కల్బుర్గీ రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఐవాన్-ఎ-షాహి ఒకటి. ఇది 19 శతాబ్దంలో నిర్మించిన అద్భుతమైన రాతి నిర్మాణంగా పేరుగాంచింది. కల్బర్గీ నగరాన్ని దర్శించే రాజకీయ నాయకులకు, అధికారులకు ఇప్పటికీ ఆతిథ్యమిచ్చే గొప్ప వసతిగృహంగా పేరెన్నికగన్నది ఈ భవనం.

కల్బుర్గీలో నిజాం వైభవం:

హైదాబాద్ నగర నిర్మాణం, ఇక్కడి భవనాలు చూసినవారికి నిజాం నవాబుల కాలంలో ఎటువంటి నిర్మాణాలు జరిగాయన్నది పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా చిట్ట చివరి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ కల్బుర్గీలో నిర్మించిన ఈ భవన నిర్మాణం కూడా హైదరాబాద్ నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోదు. ఈ భవనాన్ని ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. ఈ భవనం విశిష్టత దృష్ట్యా ఈ నగరానికి నిజాం ఎప్పుడు వచ్చినా ఇందులోనే కాలం గడిపేవారు. కల్బుర్గీ ప్యాలెస్‌ను చేరుకోడానికి ప్రత్యేకించి ఆయన హైదరాబాద్ నుంచి రైలులో వచ్చేవారు. ఆయన స్వయంగా ఈ ప్యాలెస్ ఎంట్రెన్స్ వరకు ప్రత్యేక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయించారంటే ఐవాన్ ఎ షాహి గొప్పదనం గమనించవచ్చు.

అద్భుతమైన నిర్మాణ శైలి :

ఐవాన్ ఎ షాహి నిర్మాణాన్ని మధ్య యుగ రీతులతోపాటు  ఆధునిక శైలుల మేళవింపుతో నిర్మించారు. స్థానికంగా లభ్యమయ్యే తెల్లరాళ్లను ఈ నిర్మాణంలో వినియోగించారు. వీటిని షాహాబాద్ రాళ్లు అని పిలుస్తారు. ఈ ప్యాలెస్ ముఖద్వారం గోతిక్ స్టైల్‌లో నిర్మించారు. ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా పేరుగాంచిన నిజాం ప్రభువు, కల్బుర్గీపై కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. ప్రస్తుతం ఈ భవనంలో తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పంచాయతీ మరియు సెంట్రల్ లైబ్రరీ వంటివి కొనసాగుతున్నాయి. అదే విధంగా కల్బుర్గీ నగరంలో మహబూబ్ గుషన్ గార్డెన్ కూడా నిజాం కాలంలో నిర్మించబడిందే. ఇక తన పరిపాలనా కాలంలో సేవలందించిన దేశ్‌పాండే, దేశ్‌ముఖ్, మాలీపాటిల్, పోలీస్ పాటిల్, జమదార్, మన్సఫ్దార్, పట్టేదార్, ఇనామ్‌దార్, జాగీర్దార్, కులకర్ణి, హవల్దార్ కుటుంబాలకు కోసం ఆయన నివాసాలు ఏర్పాటు చేసారు. నిజాం ఆరోజుల్లో ఆసిఫ్ గంజ్ స్కూల్‌తో పాటు ఎంపీహెచ్ఎస్ స్కూల్ కూడా స్ధాపించి ఎంతోమందికి విద్యాదానం చేశారు. అదేవిధంగా నాణ్యతగల వస్త్రాలను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అయ్యే విధంగా మహబూబ్ షాహీ కప్డా మిల్ నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఆనాడు ఎంతోమంది ఉపాధిని పొందారు. ఇది 1980 వరకు నడిచింది. ఆ తర్వాత మూతపడింది. వీటన్నిటితో పాటు కల్బుర్గీ ప్రజలకు మంచి తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్‌ను కూడా నిజాం కాలంలోని ఏర్పాటు చేసి అందరికీ మంచినీరు అందించారు. బీదర్‌లో 1942లో నిజాం విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇప్పడు అది ఇండియన్ ఎయిర్‌లైన్స్ తన పైలట్లకు శిక్షణను ఇచ్చేందుకు ఉపయోగపడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అన్ని మతాల వారినీ గౌవరించిన ఘనత నిజాంకు దక్కుతుంది. ఆయన పరమత సహనం గొప్ప వ్యక్తిగా చెప్పబడుతున్నారు. ఆయన బౌద్ధులు, జైనులు, చాళుక్యులు మరియు బహమనీలకు చెందిన అనేక స్మారక చిహ్నాలను పునరుద్ధరించడంలో నిజాం చేసిన సేవ ఎనలేనిదంటూ చారిత్రక పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

చరిత్రను కాపాడుకుందాం :

ఎంతో చారిత్ర విశిష్టతను, ప్రత్యేక శిల్పరీతుల్ని కలిగి ఉన్న కల్బర్గీలోని ఐవాన్-ఎ-షాహీని రక్షిత స్మారక కట్టడాల జాబితాలో చేర్చాలని పలువురు చరిత్ర పరిశోధకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజాం కాలంలో ఎన్నో పార్కులు, చెరువులు, టౌన్‌హాల్స్ వంటిని నిర్మించారంటున్నారు. ముఖ్యంగా కల్బుర్గీ ప్రాంతంలో మహబూబ్ సాగర్ ( ప్రస్తుతం దీన్ని శరన్ బసవేశ్వర్ సరస్సు)గా పిలుస్తున్నారు. అదే విధంంగా మహబూబ్ గుల్షన్ గార్డెన్ ఇది ప్రస్తుతం స్ధానికంగా ఉద్యానవనంగానే కొనసాగుతోంది. ఇక నిజాం కట్టించిన టౌన్‌హాల్ మాత్రం కల్బుర్గీ మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్‌గా మారిపోయింది. చారిత్రక ఆనవాళ్లను పదిలపరుచుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వీటిని కాపాడుకోవాలంటూ చరిత్రకారులు కోరుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu