CM KCR: బీఆర్ఎస్ మిషన్-2024.. గులాబీ పార్టీలో చేరిన మధ్యప్రదేశ్‌కు చెందిన కీలక నేతలు..

|

May 31, 2023 | 9:46 AM

గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా దక్షిణాదితోపాటు.. ఉత్తరాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు.

CM KCR: బీఆర్ఎస్ మిషన్-2024.. గులాబీ పార్టీలో చేరిన మధ్యప్రదేశ్‌కు చెందిన కీలక నేతలు..
Cm Kcr
Follow us on

గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా దక్షిణాదితోపాటు.. ఉత్తరాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు. న్యూఢిల్లీలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నేపధ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన, మద్దతు లభిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సహా.. పలు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లో చేరికలు పెరిగాయి. ఈ క్రమంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై సీఎం కేసీఆర్.. దృష్టిసారించారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీని అక్కడ పోటీ చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ పావులు కదిపి.. అక్కడి నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

మధ్యప్రదేశ్‌లోని బీజేపీకి చెందిన రేవా పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ బుద్దాసేన్ పటేల్ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్.. గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు బీఎస్పీ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నరేష్ సింగ్ గుర్జార్, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే సత్నా ధీరేంద్ర సింగ్, సత్నా జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు విమల బగ్రీ, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, భోపాల్ నుంచి రాకేష్ మాల్వియా, సత్యేంద్ర సింగ్ తదితరులు BRS పార్టీలో చేరారు.

Mp Brs

కాగా.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ బుద్‌సేన్ పటేల్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ సమన్వయకర్తగా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ మధ్యప్రదేశ్‌లో పర్యటించిన అనంతరం నేతలు, ప్రజలను కలుసుకుని.. పార్టీ విస్తరణ తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తామని పార్టీలో చేరిన నేతలు తెలిపారు. తెలంగాణ మోడల్ సుపరిపాలన కోసం మధ్యప్రదేశ్ ప్రజలు పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ లో త్వరలో పెద్దఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. కాగా.. త్వరలో సీఎం కేసీఆర్‌ మధ్యప్రదేశ్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. భోపాల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..