AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teachers’ Day: పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు… అరిటాకులు కొనలేక నేల మీదే వడ్డించుకున్నారు

Teachers' Day: ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా (1962 నుంచి 67) పదవులకే వన్నెతెచ్చిన 'భారతరత్నం'..

Teachers' Day: పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు... అరిటాకులు కొనలేక నేల మీదే వడ్డించుకున్నారు
Teachers' Day 2022
Subhash Goud
|

Updated on: Sep 05, 2022 | 6:34 AM

Share

Teachers’ Day: ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా (1962 నుంచి 67) పదవులకే వన్నెతెచ్చిన ‘భారతరత్నం’. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలో, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ ఆయనకు చరిత్రలో శాశ్వత స్థానం కల్పించింది. ‘తత్వవేత్తలు రాజ్యాధిపతులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాంతులు విలసిల్లుతాయి’ అన్న గ్రీక్ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు రాధాకృష్ణనే నిలువెత్తు నిదర్శనం. ముందుగా ఆయన జీవితంలోని మధుర ఘట్టాలను ఒకసారి చూసేద్దాం…

చదువంతా ఆ డబ్బుతోనే..

సర్వేపల్లి రాథాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతి సమీపంలోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతుల కుమారుడైన రాథాకృష్ణన్ తొలినాళ్లు తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాథాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కెవి హైస్కూలులో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేట్లోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూలులోనూ జరిగింది. ఆయన చదువంతా స్కాలర్‌షిప్‌ల‌తో జరిగిందంటే ఆయనలోని ప్రతిభ ఏమిటో అవగతం చేసుకోవచ్చు. పదహారేళ్ల ప్రాయంలో పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకామును రాథాకృష్ణన్ పెళ్లాడారు. వీరికి గోపాల్ అనే కుమారుడుతో పాటు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కేవలం రూ.17 జీతంతో అతి కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు రాధాకృష్ణన్.

ఇవి కూడా చదవండి

అరిటాకులు కొనలేక.. నేల మీదే వడ్డించుకున్నారు:

మహా తత్వవేత్త, విద్యావేత్త అయిన రాధాకృష్ణన్ కడు పేదరికాన్ని అనుభవించారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో అన్నం తినడానికి ఒక పళ్ళెం కూడా కొనుక్కునే స్తోమత లేక అరిటాకులపై భోజనం చేసేవారు. ఒక్కోసారి అరిటాకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులేకపోతే, నేలపై నీటితో శుభ్రం చేసుకుని ఆ నేలపైనే అన్నం వడ్డించుకుని తిన్నారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి తనకు వచ్చిన పతకాలను అమ్ముకోవాల్సి వచ్చింది.

నా పుట్టినరోజు ఇలా కాదు..!

అయితే విద్యార్థులను వారి కన్న తల్లిదండ్రులకంటే మిన్నగా ప్రేమించి, జ్ఞానదానం చేసిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయలోకానికి ఆదర్శప్రాయులు. వారి వాగ్దాటి, ఉపన్యాసాలు విద్యార్థులనే కాదు, పెద్దలనూ ఉర్రూతలూగించేవి. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, ఆయన మిత్రులు సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు వేడుకలకు అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి ఆయన నవ్వుతూ ‘నా పుట్టినరోజుకు బదులు ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపితే బాగుంటుంది’ అని సూచించారు. అప్పట్నించి (1962) ఏటా రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినంగా దేశం జరుపుకొంటోంది.

బహుమతి వస్తే.. అలా ఇచ్చేశారు

ఈ తత్వవేత్త బోధన జీవితాన్ని పరిశీలిస్తే… మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో 1909లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మైసూరు, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో తత్వశాఖ అధ్యక్షులుగా ఎదిగారు. 1929లో మాంచెస్టర్ కాలేజీలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆయన భారతదేశం తిరిగివచ్చి 1931 నుంచి 1936 వరకూ ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అదే ఏడాది, మళ్లీ 1937లో లిటరేచర్లో ఆయన నోబుల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన బెనారస్ హిందూ యూనివర్శిటీలో 1948 జనవరి వరకూ వైస్ఛాన్సలర్గా కూడా పనిచేశారు. వీరి అద్వితీయ ప్రతిభను గుర్తించిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 1989లో రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు ఉపకారవేతనాన్ని కూడా అందజేస్తోంది. అంతకుముందు తనకు వచ్చిన టెంపుల్టన్ ప్రైజ్ బహుమతి మొత్తాన్ని విద్యా సేవల కోసం ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చేశారు.

పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు..

విద్యావేత్త, తత్వవేత్తగా విజయవంతమైన జర్నీ సాగించిన రాథాకృష్ణన్ ఆలస్యంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1931లో లీగ్ ఆఫ్ నేషన్స్… కమిటీ ఫర్ ఇంటలెక్చువల్ కో-ఆపేరేషన్కు నామినేట్ అయ్యారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూనెస్కోలో (1946-52) ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం సోవియన్ యూనియన్‌కు భారత రాయబారిగా 1949 నుంచి 1952 వరకూ పనిచేశారు. 1952లో భారత తొలి ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. 1962 నుంచి 67 వరకూ భారత రెండవ రాష్ట్రపతిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్ర్రెస్ పార్టీ నేపథ్యం కానీ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేపథ్యం కానీ రాథాకృష్ణన్ కు లేవు. ఏ పదవిలో ఉన్నా, ఏ వ్యాపకంలో ఉన్నా భారతీయ తాత్విక విలువలను పాదుకొల్పడం, హిందూ ధర్మ విశిష్టతను తెలియజేయడమే ఆయన ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఇక్కడొక ఆసక్తికరమైన నేపథ్యాన్ని చెప్పుకోవాలి. నిజానికి రాధాకృష్ణన్ పై చదువులకు వెళ్ళడం వారి తండ్రి వీరాస్వామికి ఇష్టముండేది కాదట. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తన కుమారుడు ఏదైనా ఆలయంలో పూజారిగా స్థిరపడాలని తండ్రి కోరుకునేవారట. అయితే, కుమారుడి అద్భుత ప్రజ్ఞ చూసి చదివించాలని నిర్ణయించుకున్నారు. ఆ తండ్రి మనసు మారకుంటే మనం గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అయిన ఈ ఉన్నతమైన వ్యక్తిని భారత రాష్ట్రపతిగా చూసి ఉండేవారం కాదేమో.

1967లో రాష్ట్రపతి పదవి నుంచి విరమణ పొందాక మద్రాసులోని తన నివాసం ‘గిరిజ’లో ఆనందంగా గడిపారు. రాష్ట్రపతిగా మూడవసారి పదవిని నిర్వహించమని కోరినా వద్దన్నారు. 1975లో ఏప్రిల్ 17న 86 ఏళ్ల ప్రాయంలో రాధాకృష్ణన్ కన్నుమూశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి