చెన్నై, ఆగస్టు 4: దేశవ్యాప్తంగా టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. చాలా చోట్ల కేజీ టమాట రూ.200కుపైగానే విక్రయిస్తు్న్నారు. దీంతో టమాట కొనాలనంటేనే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. టమాట రైతులు మాత్రం ఇన్నళ్లకు తమకు మంచి రోజులొచ్చాయని పండగ చేసుకుంటున్నారు. ఐతే తమిళనాడులోని ఈ రైతులు మాత్రం లాభాపేక్షలేకుండా కేజీ టమాట కేవలం రూ.80లకే విక్రయిస్తున్నారు. వివరాల్లోకెళ్తే..
రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కుంట ప్రాంతానికి చెందిన రైతులు రామన్, పుట్టస్వామి సోదరులు. వీరిద్దరు రైతు సోదరులు తమ పొలంలో పండిన టమాటాలను లాభాపేక్ష లేకుండా కేజీ రూ.80కే విక్రయిస్తున్నారు. ఇలా తమ గ్రామంలో ఇప్పటి వరకు 1000 కేజీల వరకు టమాటాలను విక్రయించినట్లు తెలిపారు. వ్యాపారస్తులు అధిక ధర ఆశ చూసినా తాము మాత్రం తమ గ్రామ ప్రజలకు రూ.80కే టమాటా విక్రయించామని, అందుకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. నిజానికి నీలగిరిలో చాలా చోట్ల కిలో టమాట రూ.150కి పైగానే విక్రయిస్తున్నారు. ఇలా అతి తక్కువ ధరకు టమాట విక్రయిస్తున్న సోదరులు నీలగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
‘వ్యవసాయమే మా వృత్తి. ఈ ప్రాంతంలో అందరూ పండించే కొండ కూరలనే మేము కూడా పండిస్తాం. ఇంటి అవసరాల కోసం ఒకప్పుడు టమాట సాగు చేసేవాళ్లం. మంచి దిగుబడి రావడంతో టమాట సాగు చేయడం ప్రారంభించాం. గత ఏప్రిల్ నెలలో మైసూరు నుంచి వెయ్యి టమాటా మొక్కలు కొని మా పొలంలో నాటం. అప్పుడు టమాటా ధర కేజీ రూ.10 మాత్రమే. ఎండల వల్ల 400 మొక్కలు చనిపోయాయి. 6 వందల మొక్కలను మాత్రం వాడిపోకుండా అతి కషంమీద బతికించుకోగలిగాం. మా కష్టానికి ఫలితం దక్కింది. కుంట ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం టమాట సాగుకు అనుకూలంగా ఉన్నా అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకోవడం మాత్రం కష్టంగా ఉంది. అడవి గేదెలు, దుప్పులు, ఎలుగుబంట్లు, కోతులు పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో సాగుకు చాలా ఖర్చు అవుతోంది. ఇప్పటి వరకు వెయ్యి కిలోలకు పైగా టమాటాలను కేజీ రూ.80కే అమ్మాం. ఎక్కెడెక్కడి నుంచో వచ్చి వ్యాపారులు అధిక ధర ఆశ చూపి టమాలు విక్రయించమని కోరారు. కానీ స్థానికంగా టమాట కొరత ఉండటం వల్ల ఇతరులకు అమ్మడానికి మేము ఇష్టపడటం లేదు. దీనిని కుంట ప్రజలకు మేము చేస్తున్న సేవగా భావిస్తామని’ గర్వంగా చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.