Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్.. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలతో..

తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వర్సెస్‌ అధికార పార్టీ డీఎంకే వ్యవహారం మరింత ముదిరింది. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ రవి చేసిన ప్రసంగం మరింత వేడి రాజేసింది.

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్.. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలతో..
MK Stalin - RN Ravi,

Updated on: Jan 09, 2023 | 3:00 PM

తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వర్సెస్‌ అధికార పార్టీ డీఎంకే వ్యవహారం మరింత ముదిరింది. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ రవి చేసిన ప్రసంగం మరింత వేడి రాజేసింది. దీంతో గవర్నర్‌ రవి ప్రసంగాన్ని డీఎంకేతో సహా మిత్రపక్ష ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలన్న గవర్నర్‌ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమిళ ప్రజలను గవర్నర్‌ కించపరుస్తున్నారంటూ అసెంబ్లీలో డీఎంకే సహా పలు పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్ఎన్ రవి ప్రసంగించారు. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్‌ రవి వ్యాఖ్యానించారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలంటూ పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారు గవర్నర్‌ రవి. ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు.

కావాలనే గవర్నర్ తన ప్రసంగంలో తమిళనాడు అనే పదాన్ని ఉచ్ఛరించలేదంటూ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రసంగం కాపీల్లో తమిళనాడు అని ఉన్నా ప్రస్తావించని వైఖరిపై సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారన్నారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సోమవారం అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. రవి జాతీయ గీతం కోసం కూడా వేచి ఉండకుండా వెళ్లిపోయారని సభ్యులు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

తమిళనాడును శాంతి స్వర్గంగా అభివర్ణిస్తూ లౌకికవాదం, పెరియార్, బీఆర్ అంబేద్కర్, కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి నేతల ప్రస్తావనలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కొన్ని భాగాలను గవర్నర్ దాటవేశారని ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార డీఎంకే ప్రచారం చేస్తున్న ‘ద్రావిడ మోడల్’ ప్రస్తావన కూడా ఆయన చదవలేదు. గవర్నర్ చర్య అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని ఎంకే స్టాలిన్ తీర్మానంలో పేర్కొన్నారు. అధికార DMK పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), CPI, CPI(M) అంతకుముందు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. గవర్నర్ రవి తీరుపై మండిపడ్డారు. కావాలనే ప్రభుత్వం రూపొందించిన బిల్లులను రవి ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు.

కాగా, గవర్నర్ రవి, తమిళనాడు ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదం నెలకొంది. ఆన్‌లైన్ జూదం, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌లను నియమించడానికి గవర్నర్ అధికారాలను తొలగించడం సహా అసెంబ్లీ ఆమోదించిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో గవర్నర్ రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో “క్విట్ తమిళనాడు” అంటూ నినాదాలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని తమిళనాడులో రుద్దొద్దు అంటూ అధికార డీఎంకే ఎమ్మెల్యేలు ఈ సందర్బంగా నినాదాలు చేశారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం..