Good News: వేతనజీవులకు ఊరట.. లీటరు పెట్రోల్‌పై రూ.3 తగ్గించిన ఆ రాష్ట్ర సర్కారు
దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైన చేరింది. ఈ నేపథ్యంలో వేతనజీవులకు ఊరట కలిగించేలా పెట్రోల్ ధరలను తగ్గిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Petrol Price News: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును దాటాయి. పెట్రో ధరల దెబ్బకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ధరాఘాతాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని వేతనజీవులకు ఊరట కలిగిస్తూ స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లీటరు పెట్రోల్ ధరను రూ.3 లు తగ్గించింది. తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పి.త్యాగరాజన్ శుక్రవారంనాడు తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించారు. ఈ సందర్భంగా పెట్రోల్ ధరను లీటరుపై రూ.3 తగ్గిస్తున్నట్లు తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రకటించారు. ఆ మేరకు పన్నులను తగ్గించి పెట్రోల్ ధరలను తగ్గిస్తామని వివరించారు. పెట్రోల్ ధరను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఏడాదిలో రూ.1,160 కోట్ల లోటు ఏర్పడనుందని తెలిపారు.
తమిళనాడులో శుక్రవారంనాడు లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ.102.49గా ఉంది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో పెట్రోల్ ధర రూ.100 దిగువునకు చేరుకోనుంది. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెట్రో ధరల భారం నుంచి కాస్తైనా ఊరట కలిగే అవకాశముంది. తమిళనాడులో దాదాపు 2.6 కోట్ల మంది ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నారు. పెట్రోల్ ధరల తగ్గింపుతో వీరికి పెట్రో భారం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని తన బడ్జెట్ ప్రసంగంలో తమిళనాడు ఆర్థిక మంత్రి పి.త్యాగరాజన్ పేర్కొన్నారు.
తమిళనాట డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ లీటరు ధరను రూ.5లు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫోస్టోలోనూ డీఎంకే హామీ ఇచ్చింది. దీన్ని నెరవేర్చడంలో భాగంగా ఇప్పుడు రూ.3లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మేనిఫోస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో రూ.2లు త్వరలోనే తగ్గించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Also Read..
బెదిరింపు చీటీతో దొంగ .. చేతిరాత అర్థం కాక పట్టించుకోని క్యాషియర్… తర్వాత ఏమైందంటే
Vijay Sethupathi: విజయ్ సేతుపతి కారణంగా సినిమా పేరునే మార్చేశారు.. కారణం ఇదే..