Amma Canteens: అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై అనిశ్చితి.. ఏడాది ఏడాదికి పెరుగుతున్న నష్టాలు.. వల్ల కాదంటూ చేతులెత్తేసిన కార్పొరేషన్
అమ్మ క్యాంటీన్ల పథకం కొనసాగింపుపై అనిశ్చిత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్.. భారీ నష్టాలను చవిచూస్తున్నామని.. ఈ పథకం కొనసాగించడానికి కష్టమని పేర్కొంది.
Amma Canteens: పేదవారి ఆకలి తీర్చడం కోసం దివంగత సీఎం జయలలిత అమ్మ క్యాంటీన్లను 2013లో ప్రారంభించారు. తమిళనాడులోని అప్పటి ఏఐఏడీఎంకే ప్రభుత్వం పేద, సామాన్యుల ఆకలి తీర్చడం కోసం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ప్రారంభించారు. అయితే అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై నీలి నీడలు అలుముకున్నాయి. అమ్మ క్యాంటీన్ల పథకం కొనసాగింపుపై అనిశ్చిత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్.. భారీ నష్టాలను చవిచూస్తున్నామని.. ఈ పథకం కొనసాగించడానికి కష్టమని పేర్కొంది. అంతేకాదు ఇదే విషయాన్నీ సీఎం స్టాలిన్ సర్కార్ దృష్టికి తీసుకుని వెళ్ళింది. రికార్డుల ప్రకారం.. 2020 వరకు ఒక్క చెన్నై నగరంలోని 403 అమ్మ క్యాంటీన్ల వలన కార్పొరేషన్ రూ.468 కోట్ల నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. అమ్మ క్యాంటీన్లను ప్రారంభించిన సంవత్సరం నుండి గత సంవత్సరం వరకు.. క్యాంటీన్లు నిర్వహణకు తలకు మించిన భారంగా మారింది. రోజు రోజుకీ భారీగా కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు .. తక్కువ ఆదరణ కారణంగా నష్టాలను చవిచూస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.
క్యాంటీన్‌ల నష్టాలు మొదటి సంవత్సరంలో రూ. 34.94 కోట్ల ఉండగా.. 2016-17లో రూ. 129.04 కోట్లు, 2020-21లో రూ. 132 కోట్లకు ఆ నష్టాలు చేరాయి. దీంతో అమ్మ క్యాంటీన్లు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ చోటు చేసుకున్న నష్టాలు ఏకంగా రూ. 700 కోట్లకు పైగా ఉన్నాయని సీనియర్ కార్పొరేషన్ అధికారి వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ పథకాన్ని అధ్యయనం చేయడానికి, దానిని లాభదాయకంగా మార్చడానికి ప్రణాళికను రూపొందించడానికి పౌర సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారి పేర్కొన్నారు. విరాళాలు, కార్పొరేట్ల నుండి నిధులను సేకరించడం ద్వారా క్యాంటీన్లకు నిధులు సేకరించాలని సూచించారు. అమ్మ క్యాంటీన్ల నిధులను సేకరించడానికి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఓ నివేదికను సమర్పించింది. ఈ పథకం కోసం నిధులను సేకరించేందుకు 2019లో కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం మునుపటి ఏఐఏడీఎంకే ప్రభుత్వం అమ్మ ఉనవగం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది.
అయితే ప్రస్తుత డిఎంకె ప్రభుత్వం అమ్మ క్యాంటీన్ల పథకాన్ని మూసివేయాలని కోరుకుంటోందని ఎఐఎడిఎంకె నేతలు ఆరోపిస్తున్నారు. సీఎస్‌ఆర్ ఫండ్ పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్యాంటీన్లు నిర్వహించాలని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం చెన్నై కార్పొరేషన్‌కు సూచించింది. ఫౌండేషన్ తగినంత నిధులను సేకరించడం విఫలమైతే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందా అని చెన్నై కార్పొరేషన్ స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రస్తుతం అమ్మ క్యాంటీన్ల నిర్వహణ గాలిలో దీపంగా మారినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..