సౌత్ పాలిటిక్స్‌పై బీజేపీ ఫుల్ ఫోకస్ పెంచుతోంది. దానిలో భాగంగా.. తమిళనాడు రాజకీయంగా దూకుడుగా వెళుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను రాజకీయంగా టార్గెట్ చేశారు. తాజాగా.. డీఎంకే ఫైల్స్ పేరుతో స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలను, అఫిడవిట్‌లో వెల్లడించని ఆస్తుల వివరాలను పోల్చుతూ వీడియో విడుదల చేసి ప్రకంపనలు సృష్టించారు. లెక్కల్లో చూపని ఆస్తుల చిట్టాను అన్నామలై బట్టబయలు చేశారు. ఒక్క స్టాలిన్ ఆస్తులే కాదు.. డీఎంకే మంత్రుల ఆస్తులను కూడా వీడియోలో పూసగుచ్చినట్టు వివరించారు. తమిళనాడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేతల చిట్టాను అన్నామలై విడుదల చేశారు. ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో తమిళనాడు బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో సీఎం స్టాలిన్ తో పాటు డీఎంకే నేతలు 1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు అన్నామలై. డీఎంకే నేతల ఆస్తుల చిట్టాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాదు.. ఒక్క డీఎంకే నేతల కుంభకోణాలు మాత్రమే కాదని, అన్ని పార్టీల అవినీతి బాగోతాలను తమిళనాడు ప్రజల ముందు ఉంచుతానని చెప్పడం హాట్‌టాపిక్ మారుతోంది. ‘నా భూమి.. నా ప్రజలు’ పేరుతో తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం విడుదల చేసిన డీఎంకే నేతల అవినీతి చిట్టా పార్ట్-1 మాత్రమేనని, ఈ సంవత్సరం అంతా సిరీస్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు అన్నామలై.
మరోవైపు.. ట్విటర్‌లోనూ తమిళనాడు బీజేపీ యాక్టివ్‌గా ప్రచారం చేస్తోంది. ట్విటర్‌లో డీఎంకే ఫైలస్, అన్నామలై ట్రెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్విటర్ అకౌంట్‌లో కూడా డీఎంకే ఫైల్స్ వీడియోలతో బీజేపీ సోషల్ మీడియా విభాగం హోరెత్తిస్తోంది. ఇక.. బీజేపీ డీఎంకే ఫైల్స్‌పై తమిళనాడు అధికార పార్టీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్ భారతి ‘డీఎంకే ఫైల్స్ ఒక జోక్’ అని కొట్టిపారేశారు. అదానీ గురించి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక నుంచి, ఆరుద్ర కుంభకోణం నుంచి ప్రజల ఆలోచనను దారి మళ్లించేందుకే అన్నామలై ఈ తరహా ఎత్తుగడకు తెరలేపారని డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతి విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..