AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట రాజుకున్న ఎన్నికల వేడి.. పోటా పోటీ ప్రచారాలతో నేతల జోరు.. మహిళల ఓట్లపైనే కమల్‌హాసన్‌ గురి

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఈ ఎన్నికల్లో సినీ తారలు దిగివచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తమిళనాట రాజుకున్న ఎన్నికల వేడి.. పోటా పోటీ ప్రచారాలతో నేతల జోరు.. మహిళల ఓట్లపైనే కమల్‌హాసన్‌ గురి
Balaraju Goud
|

Updated on: Mar 03, 2021 | 9:01 PM

Share

Tamil Nadu Assembly Elections 2021 : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. సినిమా, రాజకీయాలు ఒకదానితో ఒకటి పెనవేసుకున్న తమిళ పాలిటిక్స్.. ఏడు దశాబ్దాలుగా రాజకీయాలు ప్లస్‌ సినీరంగం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తారలు దిగివచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాలు తన వల్ల కాదని తప్పుకున్నారు కానీ ఉలగనాయకన్‌ కమల్‌హాసన్‌ మాత్రం రాజకీయాలలో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనే డిసైడయ్యారు. సినీ నటి రాధిక శరత్ కుమార్ తమిళనాడు ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మక్కల్‌ నీది మయ్యం అధినేత, సినీ నటులు కమల్‌హాసన్‌ దూకుడు పెంచారు. ఇటు నిరుద్యోగ యువతతో పాటు మహిళా ఓటర్లను టార్గెట్‌ చేసుకుని వారి సంక్షేమానికే పెద్దపీట వేస్తామని హామీఇచ్చారు. రాష్ట్రంలో 50లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తానని, మహిళలకు 50శాతం ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కమల్‌హాసన్‌. మహిళల రక్షణకోసం 181 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ తీసుకొస్తానన్నారు. శానిటరీ నాప్‌కిన్లు, బాధలో ఉన్న మహిళల సంరక్షణ, ఒంటరి తల్లులకు మద్దతు, మహిళలందరికీ ఉచిత పునరుత్పత్తి ఆరోగ్యపరీక్షవంటివి కమల్‌ హామీలతో ముంచెత్తున్నారు. నిరుద్యోగభత్యాన్ని సవరిస్తానని కూడా హామీ ఇచ్చారు కమల్‌.

మరోవైపు, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట జెండా ఎగరేయాలనుకుంటోంది బీజేపీ. డీఎంకే కాంగ్రెస్‌ కూటమితోనే ప్రధాన పోటీ అనుకుంటే.. థర్డ్‌ఫ్రంట్‌ ప్రయత్నాలతో రేసులో నేనూ ఉన్నానంటున్నారు కమల్‌హాసన్‌. అగ్రశ్రేణి నాయకత్వం నేరుగా వస్తే డీఎంకేతో పొత్తుకు కూడా సిద్ధమంటూ అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నాల్లో ఉన్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ ప్రయత్నాల్లో ఇప్పటికే శరత్‌కుమార్‌ పార్టీ సముత్వ మక్కల్‌ కట్చి, ఇందిరా జననయాగ కట్చి ప్రతినిధులతో కమల్‌ సమాలోచనలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగానే పార్టీ ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్న కమల్‌హాసన్‌.. మార్చి 7న తొలి జాబితా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కోలీవుడ్‌ బేస్‌ని ఉపయోగించుకుని సినీ ప్రముఖుల మద్దతు కోరుతున్నారు.

ఇప్పటికే కమల్‌తో చర్చలు జరిపిన శరత్‌కుమార్‌…కొత్త కూటమి కోసం మరింత మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. భర్తకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న రాధికాశరత్‌కుమార్‌.. అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే కూటమిలో తమను దారుణంగా అవమానించారని ఆరోపించారు. ఇంతకాలం అన్నాడీఎంకే కూటమిలో ఉన్నామని, తమను కరివేపాకులా తీసిపారేశారని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎవరికి భయపడే రకం కాదన్నారు. ఎన్నికల్లో తమ బలమేంటో ప్రత్యర్ధులకు తెలుస్తుందంటూనే.. తమను అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంగమ్మశపథం చేశారు నటి రాధిక. తన భర్త చాలా ధైర్య వంతుడని, ఈ ఎన్నికల్లో తమ ఎస్ఎమ్‌కే పార్టీ బలమెంతో నిరూపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అమ్మ టైంకి ఇప్పటికీ సీన్‌మారిపోవటంతో సందిగ్ధంలో ఉంది శశికళ శిబిరం. కమల్‌పార్టీతో కలిసిరావాలని శరత్‌కుమార్‌లాంటివారు రాయబారం నెరుపుతుంటే…పళని టీంని పూర్తిగా నమ్ముకోలేక చిన్నమ్మపై ఆశలు వదులుకోవడం లేదు బీజేపీ. శశికళని అన్నాడీఎంకేలోకి ఆహ్వానించాలని బీజేపీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు అన్నాడీఎంకే బీజేపీ మధ్య సీట్ల వ్యవహారం ఇంకా తేలలేదు. ఐయూఎంఎల్‌కు 3 సీట్లు, ఎంఎంఏకి రెండుసీట్లిచ్చి పొత్తు కుదుర్చుకున్న డీఎంకే…ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌ సీట్ల విషయాన్ని తేల్చలేకపోతోంది

ఇదిలావుంటే, ఎన్నికల ముందు రెండు పార్టీలు ఏకమయ్యే అవకాశం లేకపోయినా ఫలితాల తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలలో తాము పోటీ చేయబోతున్నట్టు బహుజన సమాజ్‌ పార్టీ ప్రకటించింది. అయితే, ఏదైనా కూటమి నుంచి ఆహ్వానం వస్తే మాత్రం మనసు మార్చుకునే అవకాశం ఉంది. దశాబ్దాల కాలం తర్వాత ఇద్దరు దిగ్గజాలు కరుణానిధి, జయలలితలు లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతున్నదో చూడాలి..

Read Also…  కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు.. ఈ ఏడాది మూడు విడతల్లో సామూహిక వివాహాలకు టీటీడీ ఏర్పాట్లు