అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?
కేవలం 65 రోజులే కలిసి ఉన్నారు.. కానీ 13 ఏళ్లుగా కోర్టుల్లో కొట్లాడుకుంటున్నారు.. ఒకరిపై ఒకరు ఏకంగా 40 కేసులు. వీరి తీరుపై విసుగు చెందిన సుప్రీంకోర్టు, చివరకు విడాకులు మంజూరు చేస్తూనే ఇద్దరికీ షాకిచ్చే తీర్పునిచ్చింది. న్యాయవ్యవస్థను ఆటస్థలంగా మార్చుకోవద్దంటూ గట్టిగా హెచ్చరించింది.

కేవలం రెండు నెలలు కూడా కలిసి ఉండని ఒక జంట, గత 13 ఏళ్లుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అసాధారణంగా దుర్వినియోగం చేయడమే” అని అభివర్ణించిన సుప్రీంకోర్టు ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే, గట్టి హెచ్చరికతో కూడిన తీర్పునిచ్చింది. జనవరి 2012లో ఈ జంటకు వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం 65 రోజులకే భార్య తన భర్త, అతని కుటుంబంపై క్రూరత్వ ఆరోపణలు చేస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి మొదలైన వీరి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఏకంగా 40కి పైగా కేసులు దాఖలు చేసే వరకు వెళ్లింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని పలు కోర్టులు, హైకోర్టులలో దశాబ్దానికి పైగా వీరి చట్టపరమైన యుద్ధం కొనసాగింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం – కీలక వ్యాఖ్యలు
జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. “న్యాయ వ్యవస్థను వ్యక్తిగత కక్షలు తీర్చుకునే యుద్ధభూమిగా మార్చకూడదు. ఇలాంటి ప్రతీకారపూరిత వ్యాజ్యాలు ఇప్పటికే భారంతో ఉన్న న్యాయ వ్యవస్థను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి అని వ్యాఖ్యానించింది. కేవలం 65 రోజులు కలిసి ఉండి, పదేళ్లకు పైగా కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయస్థానాల సమయాన్ని వృధా చేసినందుకు గాను ఇరుపక్షాలకు చెరో రూ. 10,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆర్టికల్ 142 కింద తమకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించి వీరి వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. భవిష్యత్తులో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి కేసులు వేయకుండా శాశ్వత నిషేధం విధించింది.
మధ్యవర్తిత్వంపై నొక్కిచెప్పిన కోర్టు
వైవాహిక వివాదాలలో క్రిమినల్ కేసులు మొదలైన తర్వాత సయోధ్యకు అవకాశం తక్కువగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమయాల్లో ముందస్తు జోక్యం, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం శ్రేయస్కరమని ధర్మాసనం సూచించింది. “వివాహం రక్షించలేని స్థితికి చేరుకున్నప్పుడు, దానిని రద్దు చేయడమే అందరికీ మంచిది. లేదంటే కక్షలు, బాధలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి” అని చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
