న్యూఢిల్లీ, మార్చి 14: కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ గురువారం (మార్చి 14) ప్రకటించారు. కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే అధీర్ రంజన్ చౌదరీ వీరి పేర్లను బయటపెట్టారు. 2024 లోక్‌సభ షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందు అంటే ఫిబ్రవరి 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన పదవీ కాలం డిసెంబర్ 5, 2027 వరకు ఉంది. న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. గోయెల్ రాజీనామాను ఎలక్షన్ కమిషన్ అధ్యక్షులు ద్రౌపది ముర్ము శనివారం ఆమోదం తెలిపారు. గత నెలలో మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. దీంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. గోయెల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్‌లో ఆయన ఎన్నికల సంఘంలో చేరారు. ప్రస్తుతం అందులో సభ్యులుగా కొనసాగుతున్న రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసిన తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా నియామకం అవుతారు.
కాగా ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టుల భర్తీకి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే, కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ వారి పేర్లను బయటపెట్టారు. ఎలక్షన్ కమిషనర్లుగా మాజీ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. వీరి నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో ఓ జాబితాను రూపొందించింది. గురువారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించి ఫైనల్ లిస్టును రూపొందించారు.
కమిటీ సభ్యుల్లో అధిర్‌తో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం అధిర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తొలుత 212 మంది పేర్లను పంపించారు. అయితే సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేశ్‌ను ఈసీలుగా ఎంపిక చేశారు. ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ సభ్యులుగా ఉండాలని’ ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ)ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయించడంపై సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను మార్చి 15న అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.