Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోభం! నెలకు 5 సార్లే స్నానం.. వంట చేయకుండా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్
ఆ నగరంలో నెలలో ఐదు రోజులు మాత్రమే స్నానం.. వంట చేయడానికి కూడా నీరులేక ఆన్‌లైన్ ఆర్డర్ చేసుకుని కడుపు నింపుకుంటున్నారు. ఇక త్రాగేతర పనుల కోసం శుద్ధి చేసిన నీటిని ఎంతో పొదుపుగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగర ప్రజల నీటి కష్టాలు ఇవి. అక్కడి నీటి సంక్షోభం తారా స్థాయికి చేరింది. గుక్కెడు తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు..
బెంగళూరు, మార్చి 13: ఆ నగరంలో నెలలో ఐదు రోజులు మాత్రమే స్నానం.. వంట చేయడానికి కూడా నీరులేక ఆన్‌లైన్ ఆర్డర్ చేసుకుని కడుపు నింపుకుంటున్నారు. ఇక త్రాగేతర పనుల కోసం శుద్ధి చేసిన నీటిని ఎంతో పొదుపుగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగర ప్రజల నీటి కష్టాలు ఇవి. అక్కడి నీటి సంక్షోభం తారా స్థాయికి చేరింది. గుక్కెడు తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే.. అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. మరోవైపు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయకపోవడంతో.. ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. డిమాండ్ పెరగడంలో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.
కొన్ని ప్రాంతాల్లో గత రెండు నెలలుగా ప్రజలు నీళ్ల కోసం నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఎండాకాలం ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. మునుముందు రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో నగరంలో రోజుకు 2,600 నుంచి 2,800 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉంటే కేవలం 1,300 ఎంఎల్‌డీ నీరు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. దీంతో నీళ్ల ట్యాంకర్లు వచ్చినా సరిపోవడం లేదంటూ వాపోతున్నారు. నీటి కష్టాలు ఎప్పటికి తీరతాయో.. తమకు సాధారణ రోజులు ఎప్పటికి వస్తాయోనని తలలుపట్టుకుంటున్నారు.
మళ్లీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా కనిపిచండం లేదని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో పాలకుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు రోడ్లు, అపార్ట్‌మెంట్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. భూగర్భ జలాలలపై ఎన్నడైనా కృషి చేశారా? ఇలాంటి చర్యలు ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు ప్రధానంగా కావేరి నది, భూగర్భ జాలలు.. ఈ రెండు వనరుల ఆధారంగా నీటి సరఫరాను పొందుతుంది. తాగు నీటికి తప్ప చాలా వరకు మురుగునీటి శుద్ధి కర్మాగారాల ద్వారా ప్రాసెస్ చేసి రీసైకిల్ చేసిన నీటినే వాడుతారు. అయితే గతకొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో నీటి సంక్షోభం తలెత్తింది. ఇక ఆసుపత్రుల్లోనూ నీటి ఎద్దడి నెలకొంది. ప్రస్తుతం నగరంలోని వైట్‌ఫీల్డ్ సమీపంలోని బ్రూక్‌ఫీల్డ్ ఆసుపత్రి నీటి ట్యాంకర్లపై ఆధారపడింది. ఈ ఆస్పత్రికి ప్రతి మూడు రోజులకు 24,000 లీటర్లు అవసరం. కేవలం డయాలసిస్ యూనిట్‌కే రోజూ 5 వేల లీటర్లు అవసరం. నీటి కొరత ఇలాగే కొనసాగితే ఆస్పత్రులను నిర్వహించలేమంటున్నారు వైద్యులు. ఇదిలా ఉండగా.. నగరంలో తీవ్రమైన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి వృద్ధాకు పాల్పడిన వారికి రూ.5 వేలు జరిమానా పడుతుందని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. మళ్లీ మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రతిసారి అదనంగా రూ.500 చొప్పున ఫైన్‌గా చెల్లించాల్సి ఉంటుందని బెంగళూరు జలమండలి హెచ్చరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.