Asha Kandara: నాడు రోడ్లు ఊడ్చే స్వీపర్.. నేడు డిప్యూటీ కలెక్టర్.. సినిమా ట్విస్టులను తలపిస్తూ.. ఆశా జీవితంలో ఎదిగిన వైనం

| Edited By: Surya Kala

Jul 16, 2021 | 12:43 PM

Asha Kandara RAS కృషి పట్టుదల ఉంటె మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు.. సాధన చేస్తే మనిషి సాధించలేదని ఏమీ లేదని చెప్పడానికి అనేకమంది..

Asha Kandara: నాడు రోడ్లు ఊడ్చే స్వీపర్.. నేడు డిప్యూటీ కలెక్టర్.. సినిమా ట్విస్టులను తలపిస్తూ.. ఆశా జీవితంలో ఎదిగిన వైనం
Asha Kandara
Follow us on

Asha Kandara RAS: కృషి పట్టుదల ఉంటె మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు.. సాధన చేస్తే మనిషి సాధించలేదని ఏమీ లేదని చెప్పడానికి అనేకమంది ఉదాహరణలుగా నిలుస్తున్నారు. వారిలో ఒకరు ఆశా కందారా. కష్టాలు వచ్చాయని కుంగిపోలేదు.. చేస్తున్న పనిని చిన్న చూపు చూడలేదు.. చేసే పనిలో దైవాన్ని వేడుకుని.. తాను మరింత ఎదగడానికి నిచ్చెనగా మార్చుకున్నారు.. ఈరోజు తనకంటూ చరిత్రలో ఒక పుటని లిఖించుకున్నారు. స్వీపర్ స్థాయి నుంచి ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గా ఎదిగిన వైనం అందరికీ ఆదర్శం.. వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో మునిసిపల్ కార్పొరేషన్లో మహిళా స్వీపవర్ గా పనిచేస్తున్న ఆశా కందారా ఇప్పుడు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. నిన్నా మొన్నటి వరకూ రోడ్లు ఊడ్చిన ఆశా జీవితం సినిమాలోని ట్విస్టులను తలపిస్తుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం భర్త నుండి విడిపోయిన ఆశ తన ఇద్దరు పిల్లలను పెంచే బాధ్యతను తీసుకుంది. దీంతో ఆశా రోడ్లు ఊడ్చే పనిలో మున్సిపాలిటీ ఉద్యోగంలో చేరారు.

స్వీపర్ గా పనిచేస్తున్న సమయంలో ఆశా ప్రభుత్వ ఉద్యోగులను దగ్గర నుంచి బాగా చూశారు. దీంతో తాను కూడా ఎలాగైనా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని భావించారు. ఓ వైపు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు చదువుకుంటూ.. డిగ్రీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆశ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదవడంప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2018 లో ఆర్ఏఎస్ పరీక్షలు రాశారు. అయితే కరోనా కారణంగా ఈ పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వెలువడ్డాయి.

తాజాగా వెలువడిన ఈ ఫలితాల్లో ఆశా.. 728వ ర్యాంకు సాధించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ ఫలితాలు రావడానికి సరిగ్గా 12 రోజుల క్రితమే స్వీపర్‌గా ఆశా ఉద్యోగం పర్మినెంట్ అయింది. మరోవైపు ఆశా ఆర్ఏఎస్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు విభాగాల్లోనూ పాస్ అయ్యారు. త్వరలో ఆహా కు డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వబడుతుంది. జీవితం పూర్తిగా మారిపోయింది. కారు, మంచి జీతం, సమాజంలో గౌరవం అన్నీ ఆమె చెంతకు చేరాయి. దీంతో ఆశపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆశా మరోసారి నిరూపించారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తక్షణ శక్తినిచ్చే ఆహారం ఖర్జూరం.. ఈజీగా టేస్టీగా డేట్స్ హల్వా తయారీ విధానం..