మెహుల్ చోక్సీతో మీ లింక్ ఏమిటి ? కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ తో ప్రమేయమున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీతో మీకు లింక్ ఏమిటని కాంగ్రెస్ పార్టీని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి అయన..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ తో ప్రమేయమున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీతో మీకు లింక్ ఏమిటని కాంగ్రెస్ పార్టీని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి అయన.. మీరు చైర్ పర్సన్ గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి మెహుల్ చోక్సీ భారీగా విరాళం ఇవ్వలేదా అని అన్నారు. అలాగే చైనాలో పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో మీకు ఉన్న సంబంధమేమిటన్నారు. కొన్ని నెలల క్రితం మెహుల్ చోక్సీపై తాము ఎన్నో వార్తలు, ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు అన్నీ విన్నామని, అయితే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి మెహుల్ విరాళమిచ్చిన విషయం మాటేమిటని ప్రశ్నించారు. ఆయన నుంచి మీరు సొమ్ము అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణాలు అందేలా సాయపడ్డారు.. ఇప్పుడు ప్రధానిని విమర్శిస్తున్నారు అని నడ్డా మండిపడ్డారు. మెహుల్ చోక్సీ ఆయన బంధువు నీరవ్ మోడీ ఈ బ్యాంకు స్కామ్ లో నిందితులై దేశం విడిచి పరారైన సంగతి తెలిసిందే.. ఇక ఇండియాలోని చైనీస్ ఎంబసీ నుంచి కూడా మీ సంస్థకు విరాళాలు అందాయని, అంటే మీరు చైనా అజమాయిషీలో ఉన్నట్టేనని నడ్డా అన్నారు. ఇలాగే ఆయన కాంగ్రెస్ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ఈ ఆరోపణలను కొట్టివేస్తూ.. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి అందిన విరాళాలకు, ఇప్పటి ద్రవ్యోల్బణానికి సంబంధం ఏమిటన్నారు. ఈ ఏడాది చైనీయులు మన భూభాగంలోకి చొరబడ్డారంటే అందుకు మీ ప్రభుత్వ నిర్వాకమే కారణం కాదా అన్నారు.