Congress: సోనియా ఆ మాట ఎవరికి చెప్పలేదు.. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు..

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం పోలింగ్ తేదీ సమీపిస్తోంది. కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్షుడి పదవి కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మద్దతు మల్లికార్జున్ ఖర్గేకు..

Congress: సోనియా ఆ మాట ఎవరికి చెప్పలేదు.. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు..
Sonia gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi (File Photo)

Updated on: Oct 12, 2022 | 11:45 AM

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం పోలింగ్ తేదీ సమీపిస్తోంది. కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్షుడి పదవి కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మద్దతు మల్లికార్జున్ ఖర్గేకు ఉందని, సోనియాగాంధీనే మల్లికార్జున్ ఖర్గే పేరును సూచించారనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మద్దతు ఉండటం వల్ల మల్లికార్జున్ ఖర్గే గెలుపు నల్లేరుపై నడకే అన్న ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి రేసులో ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సూచించలేదని, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు నుంచి మద్దతు లభిస్తుందన్నవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ తన పేరును ఎన్నడూ సూచించలేదని, అవి కేవలం వదంతులు మాత్రమేనని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. సోనియా గాంధీ తన పేరును కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సూచించడం అవాస్తవమని, గాంధీ కుటుంబం నుండి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనరని, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోరని ఆమె స్పష్టంగా చెప్పారని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే పోటీ పడుతుండగా, ఖర్గేకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పూర్తి మద్దతు ఉందని, శశిథరూర్ కు పార్టీలో మద్దతు కష్టమేనని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీతో పాటు, తనను అవమానించేందుకు, కించపరిచేందుకే ఎవరో ఈ వదంతులు వ్యాప్తి చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 9,300 మంది ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని, ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడు అవుతారని ఖర్గే చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 1250 మంది ఓటర్లు ఉన్నారని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అయితే తాను గెలుపు గురించి ఎక్కువుగా ఆలోచించడం లేదని, తనను పోటీచేయమని కోరిన అభ్యర్థులే తన గెలుపు బాధ్యతలు చూసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓటర్లుగా ఉన్న పార్టీ శ్రేణులే తనను పోటీ చేయమన్నారనే అర్థం వచ్చేలా మల్లికార్జున్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం కూడా మల్లికార్జున్ ఖర్గే తాను అధ్యక్షుడిగా ఎందుకు పోటీపడుతున్నానను అనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు బాగోలేదని, దేశ విచ్ఛినకర శక్తులతో పోరాడేందుకే తాను అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నానని ఖర్గే బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులతో పోరాడేందుకు తనకు అధికారం కావాలని అందుకే పార్టీలో మెజార్టీ ప్రతినిధుల సూచన మేరకు తాను ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అక్టోబర్ 17న ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..