AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామ్నాలో మోదీపై నిప్పులు.. సేన వ్యూహం అదేనా ?

ఫలితాలు వెలువడిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్ర పీఠాన్ని సాధించేందుకు శివసేన వేస్తున్న ఎత్తుగడలతో కమలనాథులకు దిమ్మ తిరుగుతోంది. అయిదేళ్ళుగా అణచుకున్న కోపాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ప్రతీకారం తీర్చుకునే ప్లాన్‌గా మలచుకున్న శివసేన అధినాయకత్వం.. ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాల్సిందేనని పేచీ మొదలుపెట్టింది. నెంబర్ పరంగా తమపై ఆధారపడే పరిస్థితిని బిజెపికి కల్పించిన శివసేన.. రోజురోజుకూ మాటలకు పదును పెడుతోంది. 50:50 రేషియోపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటిస్తూ వస్తున్న శివసేన అధినాయకత్వం.. తమ పార్టీ […]

సామ్నాలో మోదీపై నిప్పులు.. సేన వ్యూహం అదేనా ?
Rajesh Sharma
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Oct 28, 2019 | 7:45 PM

Share

ఫలితాలు వెలువడిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్ర పీఠాన్ని సాధించేందుకు శివసేన వేస్తున్న ఎత్తుగడలతో కమలనాథులకు దిమ్మ తిరుగుతోంది. అయిదేళ్ళుగా అణచుకున్న కోపాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ప్రతీకారం తీర్చుకునే ప్లాన్‌గా మలచుకున్న శివసేన అధినాయకత్వం.. ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాల్సిందేనని పేచీ మొదలుపెట్టింది. నెంబర్ పరంగా తమపై ఆధారపడే పరిస్థితిని బిజెపికి కల్పించిన శివసేన.. రోజురోజుకూ మాటలకు పదును పెడుతోంది. 50:50 రేషియోపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటిస్తూ వస్తున్న శివసేన అధినాయకత్వం.. తమ పార్టీ పత్రిక ద్వారా కేంద్రంలోని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగింది.

దేశ ఆర్థిక మందగమనానికి బీజేపీయే కారణమంటూ సామ్నాలో సంచలన కథనం ప్రచురించింది. కేంద్రం తీసుకున్న ఆర్థిక విధానాలపై సామ్నా సోమవారం నాటి ఎడిటోరియల్‌ సంచికలో విమర్శలు గుప్పించింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి బీజేపీ విధానాలే కారణమని, దీనికి వారే బాధ్యత వహించాలంటూ పేర్కొంది. ప్రతి దీపావళి పండుగ నాడు కళకళలాడే దేశీయ మార్కెట్‌లు నేడు వెలవెలబోవడానికి కారణాలేంటో బీజేపీ తెలుసుకోవాలని సూచించారు.

ఆదివారం రోజున శివసేన నాయకులు రిమోట్‌ తమ దగ్గర ఉందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత రోజే శివసేన అధికారిక పత్రికలో ఇలాంటి కథనం రాయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, శివసేన నేత దివాకర్‌ రౌత్‌ సోమవారం వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రెండు పార్టీలు చెప్పడం గమనార్హం.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేనకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రి పదవి, ప్రభుత్వ ఏర్పాటులో చెరిసగం వాటా ఉండాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబట్టింది. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. మరోవైపు శివసేన ఉపముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు సూచిస్తున్నారు. ఈ విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. తాజాగా శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీపై ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.