Presidential Election 2022: ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ప్రకటన..

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ఇస్తుందని.. దీని కోసం శివసేన ఎంపీలు లేదా మరెవరూ తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఉద్ధవ్ స్పష్టంచేశారు..

Presidential Election 2022: ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ప్రకటన..
Uddhav Thackeray

Updated on: Jul 12, 2022 | 6:13 PM

Uddhav Thackeray: శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential election) మద్దతు అంశంపై కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపది ముర్మూకే మద్దతు ఇస్తున్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ముంబై దాదర్‌లోని శివసేన భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ఇస్తుందని.. దీని కోసం శివసేన ఎంపీలు లేదా మరెవరూ తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఉద్ధవ్ స్పష్టంచేశారు. కాగా.. ఉద్ధవ్ ఠాక్రే.. తన నివాసం మాతోశ్రీలో సోమవారం పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. హాజరైన 15 మంది ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది మర్ముకు మద్దతు ఇవ్వాలని వారంతా అభిప్రాయపడినట్టు ఆ పార్టీ ఎంపీ గజానన్‌ కిరీట్కర్‌ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర జనాభాలో దాదాపు 10శాతం మంది ఆదివాసీలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. కొంతకాలంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. బీజేపీపై కోపంగా ఉన్నారు. ఇటీవల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. శివసేన నేత ఏక్‌నాథ్‌ శిండే తిరుగుబాటు చేయడం.. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికే శివసేన మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ద్రౌపదీ ముర్మూ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి