Nirav Modi: లండన్ హైకోర్టులో నీరవ్ మోడీకి చుక్కెదురు.. భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం
గుజరాత్ కు చెందని వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ కుంభకోణం కేసులో 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఆయన మనీలాండరింగ్ ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు
భారతదేశానికి తనను అప్పగించాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖలు చేసిన అప్పీలును లండన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఆయనను ఇండియాకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు. గుజరాత్ కు చెందని వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ కుంభకోణం కేసులో 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఆయన మనీలాండరింగ్ ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు. ‘ మోడీ మానసిక పరిస్థితి బాగోలేదు. ఈ సమయంలో ఆయనను ఇండియాకు అప్పగిస్తే ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంది’ అన్న సమాధానంతో మేం సంతృప్తిగా లేము’ అని న్యాయస్థానం తెలిపింది. కాగా ప్రస్తుతం ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో కటకటాల వెనుక ఉన్న నీరవ్ మోడీకి, గత ఫిబ్రవరిలో అప్పగింతకు అనుకూలంగా జిల్లా జడ్జి సామ్ గూజీ వెస్ట్‌మిన్‌స్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేయడానికి అనుమతి లభించింది. తాజా తీర్పుతో నీరవ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది.
కాగా నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని భారత దర్యాప్తు సంస్థలు కనిపెట్టడానికి ముందే నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయారు. ఈ స్కామ్‌లో నీరవ్, చోక్సీలు కలిపి మొత్తం 25 మందిపై ఛార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరవ్‌ను భారతదేశానికి రప్పించాలని మన దర్యాప్తు ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే నీరవ్ మోడీ డిప్రెషన్‌లో వున్నారని, ఆయనను ఇండియాకు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే అవకాశం వుందని మానసిక వైద్యులు లండన్ హైకోర్టుకు తెలియజేశారు.భారత్‌లోని జైళ్లలో సరైన సదుపాయాలు లేవని నీరవ్ భయపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా నీరవ్‌ను ఇండియాకు తీసుకొస్తే ముంబైలోని ఆర్డర్ రోడ్డు జైల్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..