ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు.. తోటివారిపై పెప్పర్ స్ప్రే చేయడంతో 11 మంది బాలికలు ఆస్పత్రి పాలవ్వడం కలకలం రేపింది. గోవాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తర గోవా పరిధి బిచోలిమ్ అనే ప్రాంతంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇందులో కొందరు విద్యార్థినులు రోజూవారిగానే పాఠశాలకు వచ్చారు. అయితే ఓ తరగతి గదిలో వారు కూర్చొని ఉన్నారు. అయితే ఇంతలోనే అల్లరి చేష్టలు చేస్తూ మరికొంతమంది బాలికలు అక్కడికి వచ్చారు. ఆ గది కిటికిలోనుంచి వారిపై పెప్పర్ స్ప్రే కొట్టారు. దీంతో ఆ తరగతి గదిలో కూర్చున్నటువంటి విద్యా్ర్థినులకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో చివరికి వారు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అయితే ఈ విషయం ఆ పాఠశాల యాజమాన్యం దృష్టికి వెళ్లింది.
దీంతో వెంటనే 11 మంది విద్యార్థులని చికిత్స కోసం బిచోలిమ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం మపుస పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అల్లరి చేష్టలు చేసిన విద్యార్థినులపై యాజమాన్యం చాలా సిరియస్ అయ్యింది. వారు చేసిన అనుచిత ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాఠశాలలో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించాలని పోలీసులు సూచించారు. చివరికి పాఠశాల యాజమాన్యం నలుగురు బాలికలను సస్పెండ్ చేసింది. అయితే మరో విషయం ఏంటంటే విద్యార్థినులు పెప్పర్ స్ప్రే చల్లినటువంటి వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే చంద్రకాంత్ షెట్యే దృష్టికి వెళ్లింది. దీంతో అతను విద్యార్థినులు చికిత్స తీసుకుంటున్నటువంటి జిల్లా ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడికి వెళ్లిన తర్వాత బాధిత విద్యా్ర్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు అడిగి సమాచారం తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎమ్మె్ల్యే చంద్రకాంత్ షెట్యే తెలిపారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి కొంచెం సీరియస్‌గా ఉండటంతో వారిద్దరిని తప్ప మిగతా విద్యార్థులందరు త్వరలో డిశ్చార్జి కానున్నారు. అయితే గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమిత్ పాట్కర్, మరో ఎమ్మెల్యే కార్లోస్ ఫెరీరాలు కూడా జిల్లా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను పరామర్శించారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు ఇలాంటి ఆకతాయి చేష్టలకు పాల్పడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గోవాలోని ఈ సంఘటన సంచలనం రేపుతోంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం కూడా ఇలాంటి తరహాలోనే ఓ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ విషయాన్ని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వారి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యార్థినులు ప్రవర్తించిన అనుచిత ప్రవర్తనపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం