వలస కార్మికులను ఆదుకున్న సోనూ సూద్‌పై నోరుపారేసుకున్న శివసేన..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికులకు దేవుడయ్యాడు సోనూ సూద్. నగరంలోని అతడి స్టార్‌ హోటల్స్‌లో వైద్యులకు షెల్టర్‌ ఇచ్చాడు.

వలస కార్మికులను ఆదుకున్న సోనూ సూద్‌పై నోరుపారేసుకున్న శివసేన..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 4:25 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికులకు దేవుడయ్యాడు సోనూ సూద్. నగరంలోని అతడి స్టార్‌ హోటల్స్‌లో వైద్యులకు షెల్టర్‌ ఇచ్చాడు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను వారివారి స్వస్థలాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాడు. అంతేకాదు.. వారికి కావాల్సిన ఆహారాన్ని వారు ఇంటికి వెళ్లేదాక సరిపడేలా ఇచ్చి పంపాడు. కొన్ని వేల మందిని అలా స్వస్థలాలకు వెళ్లేలా చేస్తున్నాడు ముంబైకి చెందిన రీల్‌ విలన్ అయిన రియల్‌ హీరో. సోనూ చేస్తున్న సేవల పట్ల యావత్ భారత ప్రజలు హ్యాట్సాఫ్ చేప్తుంటే.. మరోవైపు శివసేన మాత్రం విరుచుకుపడుతోంది. తన అధికారిక పత్రిక సామ్నా వేదికగా సోనూ సూద్‌పై మండిపడుతూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక ఆయన త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తాడంటూ ఎద్దేవా చేసింది. ఇక సోనూ సూద్‌‘సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’గా అవతారమెత్తుతాడంటూ శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అంతేకాదు.. కరోనా సమయంలో ‘కొత్త మహాత్ముడు’ఊడిపడ్డాడంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు లాక్‌డౌన్ సమయంలో అన్ని బస్సులను ఎలా అందుబాటులోకి తెచ్చారని.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను వారి రాష్ట్రాల్లోకి అనుమతించలేదని.. మరి వారంతా ఎక్కడికి వెళ్లారో చెప్పాలంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

ఇదిలావుంటే.. మహారాష్ట్ర గవర్నర్.. సోనూ సూద్ చేస్తున్న సేవలపట్ల మహాత్మా సూద్ అంటూ ప్రశంసించారు. లాక్‌డౌన్ సమయంలో సూద్ ఎంతో మంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలించారని కొనియాడారు. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వలస కార్మికులను ప్రత్యేక బస్సుల్లో పంపించారు. తాజాగా ప్రత్యేక ట్రైన్‌లలో కూడా ముంబైలో చిక్కుకుపోయిన వారిని పంపించారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.