విమానంలో ఏ భాగం సురక్షితం..? ప్రమాదం జరిగినప్పుడు ఏ ప్లేస్‌లో ఉన్న ప్రయాణికులు సేఫ్ అంటే..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, విమానంలో సురక్షితమైన సీటు గురించి చర్చ జరుగుతోంది. గత అధ్యయనాల ప్రకారం, విమానం వెనుక భాగం సురక్షితమైనది. ముందు భాగంలో కూర్చున్న వారికి గాయాల ప్రమాదం ఎక్కువ. మధ్య భాగం కూడా సాపేక్షంగా సురక్షితం. కాబట్టి, వెనుక లేదా మధ్య భాగాల్లో సీట్లు బుక్ చేసుకోవడం మంచిది.

అహ్మదాబాద్‌లోని మేఘని నగర్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాద జరిగినప్పుడు విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన నిమిషం వ్యవధిలోనే విమానం సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో విమానంలో ఉన్న వారితో పాటు హాస్టల్‌లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ కూడా మరణించినట్లు సమాచారం. ఈ సంఘటన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయానికి వెళ్లే దారులన్ని మూసేశారు. అయితే ఈ భయంకరమైన ప్రమాదం తర్వాత.. తరచు విమానాల్లో ప్రయాణించే వారిలో ఒక ఆందోళన మొదలైంది.
ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ఏ భాగంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉంటారనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. విమానంలో ముందు భాగంలో కూర్చేంటే సేఫ్‌గా ఉంటామా? వెనుక తోక భాగంలో కూర్చోవాలా? లేక మధ్య భాగంలో సీటు బుక్ చేసుకోవాలా? ఏది మంచి ఎంపిక అవుతుందని సెర్చ్ చేస్తున్నారు. విమానంలో బిజినెస్ క్లాస్, ఎకానమీ అంటూ పలు విభాగాలు ఉంటాయి. బిజినెస్ క్లాస్ టికెట్లు అధిక ధర, ఎక్కువ సౌకర్యాలు కలిగి ఉంటాయి. ఎకానమీ క్లాస్‌లో తక్కువ ధర టిక్కెట్లు ఉంటాయి. మరి విమానంలో అత్యంత సురక్షితమైన ఏ సీటును బుక్ చేసుకోవాలో అనే ప్రశ్న అందరి మనస్సులో తలెత్తుతున్న నేపథ్యంలో నివేదికలు, పలు సర్వేలు వీటి గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
విమానంలో వెనుక వరుసలో కూర్చోవడం అనే ఆలోచన చాలా మంది ప్రయాణీకులకు నచ్చదు. ముఖ్యంగా మధ్య సీట్లో కూర్చోవడం వారికి ఇష్టం ఉండదు. గత 35 ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల డేటాను టైమ్ మ్యాగజైన్ 2015లో నిర్వహించిన ఒక అధ్యయనం విశ్లేషించింది. విమాన ప్రమాదాల్లో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల మరణాల రేటు తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. అధ్యయనం ప్రకారం.. విమానం వెనుక సీట్లో మరణాల రేటు 32 శాతంగా ఉంది, మధ్యలో 39 శాతం, ముందు సీట్లో 38 శాతంగా ఉంది.
ఏప్రిల్ 2012లో ఒక టెలివిజన్ స్టూడియో బృందం మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదాన్ని అనుకరించింది. ఈ పరీక్ష ఫలితాలు విమానం ముందు భాగంలో కూర్చున్న ప్రయాణీకులకు ప్రమాదంలో గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని చూపించాయి. దీనికి విరుద్ధంగా విమానం రెక్కల దగ్గర కూర్చున్న ప్రయాణీకులకు గణనీయమైన గాయాలు అయినట్లు కనుగొన్నారు. విమానం వెనుక భాగంలో ఉన్న పరీక్ష డమ్మీలు చాలావరకు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంటే ఆ ప్రాంతంలోని చాలా మంది ప్రయాణీకులు బతికే అవకాశం ఉంది. అందువల్ల విమానం వెనుక భాగంలో కూర్చోవడం సురక్షితమని చెప్పవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




