Gokarna: విషసర్పాలు సంచరించే గుహలో పిల్లలతో కనిపించిన రష్యన్ మహిళ.. పోలీసులు వెళ్లగా…
కర్ణాటక రాష్ట్రం గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండ ప్రాంతంలో ఉన్న ఓ ప్రమాదకరమైన గుహలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఉన్న ఓ రష్యన్ మహిళను పోలీసులు గుర్తించి బయటకు తెచ్చారు. విషసర్పాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతంలో ఆమె పిల్లలతో నివసించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడికెందుకొచ్చావని ఆమెను ప్రశ్నించగా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా తాను అక్కడ ఉంటున్నట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లో ఉన్న ఓ మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40) అనే రష్యన్ మహిళతో పాటు ఆమె ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు. అమె గత రెండు వారాలుగా ఈ గుహలోనే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత ఆమెను కొండకిందనున్న ఓ ఆశ్రమానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. జూలై 9న సాయంత్రం 5:00 గంటల ప్రాంతంలో గోకర్ణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ ఎస్ఆర్, అతని బృందం పర్యాటకుల భద్రత కోసం రామతీర్థ కొండ ప్రాంతంలో గస్తీ కాస్తుండగా ప్రమాదకర గుహ ప్రాంతంలో ఈమెను గుర్తించారు. ఆమె దగ్గరకు వెళ్లి ప్రశ్నించరగా తన పేరు నినా కుటినా (40 ఏళ్ల వయస్సు) అని తాను రష్యాకు చెందిన మహిళనని, తన ఇద్దరు కుమార్తెలు ప్రేమ (6 ఏళ్లు), అమా (4 ఏళ్ల)తో కలిసి గత రెండు వారాలుగా ఈ గుహ లోపల నివసిస్తున్నట్లు తెలిపింది.
బిజినెస్ వీసాపై ఇండియాకు..
కొన్నాళ్ల క్రితం బిజినెస్ విసాపై ఇండియాకు వచ్చిన తాను.. ఆధ్యాత్మిక ఏకాంతం కోసం గోవా నుండి గోకర్ణకు వచ్చినట్టు పేర్కొంది. సిటీలైఫ్‌లోని అంతరాయాలకు దూరంగా, ధ్యానం, ప్రార్థనలో పాల్గొనడానికి తాను అటవీ గుహలో నివసించాలని నిర్ణయం తీసుకొని అక్కడికి వచ్చినట్టు నీనా తెలిపింది. ఆమె ఉద్దేశాలు ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, విషసర్పాలు, కొండచరియలు విరిగి పడే ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశంలో పిల్లలతో కలిసి నివసించడం అత్యంత ప్రమాదకరమని పోలీసులు అమెకు సూచించారు. ఆ తర్వాత ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆమెతో పాటు పిల్లలను కొండకిందకు తీసుకొచ్చారు. ఆ మహిళ కోరిక మేరకు, ఆమెను కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసి స్వామి యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు.
2017లోనే ముగిసిన వీసా గడువు..
ఆమె గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అధికారులు ఆమెను వీసా వివరాల గురించి అడగ్గా.. వాటిని గుహలో ఎక్కడో పడేసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై దర్యాప్తును ముమ్మరం చేసిన గోకర్ణ పోలీసులు ఎట్టకేలకు ఆమె వీసా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసా పత్రాల ద్వారా ఆమె గురించి ఆరా తీయగా ఆమె మొదట ఏప్రిల్ 17, 2017 వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసాపై భారతదేశంలోకి ప్రవేశించిందని.. ఏప్రిల్ 19, 2018న గోవాలోని FRRO పనాజీ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడింది తేలింది. ఆ తర్వాత ఆమె నేపాల్‌కు వెళ్లి సెప్టెంబర్ 8, 2018న తిరిగి భారతదేశంలోకి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆమె వీసా గడువు ముగిసా అనధికారికంగా ఆమె ఇండియాలో నివసిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను కార్వార్‌లోని మహిళా రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు పోలీసులు.
రష్యాకు తిరిగి పంపేందుకు ఏర్పాట్లు..
స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆ మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను రష్యాకు తిరిగి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించి అధికారిక బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించారు. న్యాయ ప్రక్రియలో భాగంగా కుటుంబాన్ని బెంగళూరుకు తరలించాలని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




